Tata Motors : టాటా మోటార్స్‌కు డబుల్ ధమాకా.. మార్కెట్లో నంబర్ 2లో నిలిపిన కార్ జోడీ
మార్కెట్లో నంబర్ 2లో నిలిపిన కార్ జోడీ

Tata Motors : టాటా మోటార్స్ ప్రయాణీకుల వాహనాల విభాగంలో అద్భుతమైన ప్రదర్శన చేసింది. కంపెనీకి చెందిన నెక్సాన్, పంచ్ అనే రెండు కాంపాక్ట్ ఎస్‌యూవీల జోడీ మార్కెట్‌లో అదరగొట్టింది. ఈ రెండు కార్లు కలిసి జులై నుండి సెప్టెంబర్ 2025 వరకు టాటా పోర్ట్‌ఫోలియోను బలంగా నిలబెట్టాయి. ఈ మూడు నెలల్లో ఈ రెండు కార్లు మొత్తంగా 86,782 యూనిట్లు అమ్ముడయ్యాయని సియామ్ గణాంకాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 2025లో ఈ రెండు మోడళ్లు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ నెలలో, నెక్సాన్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. ఇక పంచ్ కూడా టాప్ 5లో నిలిచి తన సత్తా చాటింది. ఈ రెండు ఎస్‌యూవీల విజయంతో పాటు, టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్ వంటి చిన్న కార్ల విభాగం కూడా ఈ త్రైమాసికంలో 33,918 యూనిట్ల అమ్మకాలతో బలంగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే చిన్న కార్ల విభాగంలో వృద్ధి నమోదు కావడం, ఎస్‌యూవీల ట్రెండ్ ఉన్నప్పటికీ చిన్న కార్లకు కూడా డిమాండ్ ఉందని స్పష్టం చేస్తోంది.
కేవలం చిన్న ఎస్‌యూవీలే కాకుండా, టాటా మోటార్స్ ప్రీమియం ఎస్‌యూవీలైన సఫారి, హారియర్ అమ్మకాలు కూడా పెరిగాయి. ఈ విభాగంలో గత సంవత్సరం 11,187 యూనిట్ల అమ్మకాలు నమోదు కాగా, ఈ ఏడాది 14,215 యూనిట్లకు చేరుకుంది. ఇది ప్రీమియం విభాగంలో కూడా టాటా కార్లకు ఆదరణ పెరుగుతున్నట్లు సూచిస్తోంది. సాధారణంగా సెప్టెంబర్ 2025లో భారత కార్ల మార్కెట్‌లో కొంచెం మందగమనం కనిపించినా, టాటా మోటార్స్ మాత్రం అందుకు భిన్నంగా అమ్మకాలు పెంచుకుంది. టాటా మోటార్స్ ఈ నెలలో ఏకంగా మహీంద్రా, హ్యుందాయ్ వంటి పెద్ద కంపెనీలను వెనక్కి నెట్టి మార్కెట్‌లో రెండవ నంబర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. మారుతి సుజుకి మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, దాని అమ్మకాలు ఆగస్టుతో పోలిస్తే కాస్త తగ్గాయి. హ్యుందాయ్ అమ్మకాలు భారీగా తగ్గడం (ఆగస్టులో 45,686 నుండి సెప్టెంబర్‌లో 35,470కి) టాటా మోటార్స్‌కు కలిసి వచ్చింది.
సెప్టెంబర్ నెల కార్ల కంపెనీలకు అత్యంత అద్భుతమైనదిగా నిలిచింది. దీనికి ప్రధాన కారణం జీఎస్‌టీ రేట్ల తగ్గింపు. దీనివల్ల కార్ల ధరలు తగ్గడం, పండుగ ఆఫర్లు రావడంతో మార్కెట్‌లో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ అవకాశాన్ని టాటా మోటార్స్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. హ్యుందాయ్, మహీంద్రా వంటి వాటిని వెనక్కి నెట్టి మార్కెట్‌లో నంబర్ 2 స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా గత నెలలో 60,900 కంటే ఎక్కువ కార్లను విక్రయించి, టాటా మోటార్స్ తన చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాల రికార్డును కూడా నెలకొల్పింది.
