Tata Nexon : మార్కెట్ పై టాటా పంజా.. మారుతిని వెనక్కి నెట్టి బెస్ట్ సెల్లింగ్ కారుగా టాటా నెక్సాన్
మారుతిని వెనక్కి నెట్టి బెస్ట్ సెల్లింగ్ కారుగా టాటా నెక్సాన్

Tata Nexon : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఈ సంవత్సరం కూడా కార్ల సందడి కొనసాగింది. దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల విషయంలో ఎప్పటిలాగే టాటా, మారుతి సుజుకి మధ్య గట్టి పోటీ కనిపించింది. అయితే అక్టోబర్ 2025 నెల అమ్మకాలలో, టాటా సంస్థ మారుతిని వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అక్టోబర్‌లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా టాటా నెక్సాన్ నిలిచింది. కాగా మారుతి డిజైర్ రెండో స్థానంలో, మారుతి ఎర్టిగా మూడో స్థానంలో నిలిచాయి.
టాటా నెక్సాన్ అక్టోబర్ 2025లో భారత మార్కెట్‌లో మోస్ట్ పాపులర్ కారుగా నిలిచింది. అక్టోబర్ నెలలో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ 22,083 యూనిట్లు అమ్ముడైంది. గత సంవత్సరం (2024) అక్టోబర్‌తో పోలిస్తే, ఈ కారు అమ్మకాల్లో 50 శాతం భారీ వృద్ధి నమోదైంది. అయితే, గత నెల సెప్టెంబర్ 2025లో అమ్ముడైన 22,573 యూనిట్లతో పోలిస్తే, అక్టోబర్‌లో 2 శాతం స్వల్ప తగ్గుదల కనిపించింది.
టాటా నెక్సాన్ దేశంలోనే అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ కారు గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను పొందింది. ఇది అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లతో నిండి ఉంది. కారులోని అన్ని మోడళ్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తాయి. ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ పార్కింగ్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
టాటా నెక్సాన్‌లో 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ రెవోట్రాన్ ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజిన్ 4,000 ఆర్‌పిఎం వద్ద 116 PS పవర్, 1,500 నుంచి 2,750 ఆర్‌పిఎం వద్ద 260 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. భారత మార్కెట్‌లో టాటా నెక్సాన్ మొత్తం 60 వేరియంట్లలో, 6 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. టాటా నెక్సాన్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 7,31,890 నుంచి మొదలవుతుంది.

