Tata Nexon : మారుతి, హ్యుందాయ్‌లను వెనక్కి నెట్టి రికార్డు.. దేశంలోనే నంబర్ వన్ కారుగా టాటా మోడల్
దేశంలోనే నంబర్ వన్ కారుగా టాటా మోడల్

Tata Nexon : భారతీయ కార్ల మార్కెట్‌లో దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ చరిత్ర సృష్టించింది. ఆ సంస్థ కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ సెప్టెంబర్ 2025లో ఏకంగా 22,573 యూనిట్ల రికార్డు సేల్స్ నమోదు చేసింది. దీనితో మారుతి సుజుకి, మహీంద్రా, హ్యుందాయ్ వంటి పెద్ద కంపెనీల కార్లను వెనక్కి నెట్టి దేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ వెహికల్గా నిలిచింది. అంతేకాదు, టాటా మోటార్స్ చరిత్రలోనే ఒక కారు అత్యధికంగా ఒక నెలలో అమ్ముడవటం ఇదే మొదటిసారి.
నెక్సాన్ అమ్మకాలు ఇంత భారీగా పెరగడానికి ముఖ్య కారణం జీఎస్టీ 2.0 అమలు కావడం. పన్ను తగ్గింపు కారణంగా నెక్సాన్ ధర రూ.1.55 లక్షల వరకు తగ్గింది. దీనికి తోడు, కంపెనీ ఇచ్చిన ఇతర కస్టమర్ ఆఫర్ల వల్ల, నెక్సాన్ ప్రారంభ ధర కేవలం రూ.7.32 లక్షలు (ఎక్స్-షోరూమ్) మాత్రమే అయ్యింది. ఈ తగ్గింపుతో కారు మరింత తక్కువ ధరకే లభించడంతో, కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో దీనివైపు మొగ్గు చూపారు.
నెక్సాన్ చాలా కాలంగా కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పటిష్టమైన స్థానంలో ఉంది. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే దాదాపు 90,000 యూనిట్లు అమ్ముడుపోవడం దానికి ఎంత డిమాండ్ ఉందో తెలియజేస్తుంది. నెక్సాన్ విజయానికి మరో పెద్ద కారణం.. ఇది పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ అనే నాలుగు ఫ్యూయెల్ ఆప్షన్లలో లభించడం.
నెక్సాన్ అతిపెద్ద బలం దాని సేఫ్టీ. దీని పెట్రోల్, డీజిల్, ఈవీ వెర్షన్లు అన్నీ భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్ పొందాయి. ఫీచర్ల విషయానికొస్తే, ఇందులో LED హెడ్‌ల్యాంప్స్, వెంటిలేటెడ్ సీట్లు, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360° కెమెరా, బ్లైండ్-స్పాట్ మానిటర్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి.
నెక్సాన్ అద్భుత ప్రదర్శన కారణంగా టాటా మోటార్స్ సైతం సెప్టెంబర్ 2025లో తమ చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలు (60,907 యూనిట్లు) నమోదు చేసింది. కంపెనీ 2026ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అమ్మకాలు 1.44 లక్షల యూనిట్లకు చేరాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 10% ఎక్కువ. ముఖ్యంగా, ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో కూడా కంపెనీ రికార్డు స్థాయిలో 24,855 యూనిట్లను అమ్మింది. ఇది మొత్తం ప్యాసింజర్ వెహికల్ సేల్స్‌లో 17% వాటా కలిగి ఉంది.
