Tata Nexon : టాటా నెక్సాన్ అదిరిపోయే అప్డేట్.. 10 లక్షల లోపే పనోరమిక్ సన్‌రూఫ్.. దేశంలోనే మొదటి కారు
10 లక్షల లోపే పనోరమిక్ సన్‌రూఫ్.. దేశంలోనే మొదటి కారు

Tata Nexon : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్లో సరికొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టి మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కేవలం రూ.10 లక్షల లోపు ధరలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఉండే పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను అందిస్తూ మధ్యతరగతి వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. టాటా మోటార్స్ తన ఫేవరెట్ ఎస్‌యూవీ నెక్సాన్లో సరికొత్త వేరియంట్ Pure+ PSని లాంచ్ చేసింది. దీని ప్రత్యేకత ఏమిటంటే, కేవలం రూ. 9.59 లక్షల ప్రారంభ ధరలోనే (ఎక్స్-షోరూమ్) మీకు పనోరమిక్ సన్‌రూఫ్ లభిస్తుంది. సాధారణంగా ఇటువంటి ఫీచర్ చాలా ఎక్కువ ధర ఉండే ప్రీమియం కార్లలో మాత్రమే కనిపిస్తుంది. 10 లక్షల లోపు ధరలో ఈ ఫీచర్ అందిస్తున్న దేశంలోనే తొలి కారు ఇదే కావడం విశేషం. దీనివల్ల కారు లోపల కూర్చున్నప్పుడు కేబిన్ చాలా విశాలంగా, ప్రీమియంగా అనిపిస్తుంది.
టాటా నెక్సాన్ ఇప్పటికే 10 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకోవడంతో, ఆ ఆనందాన్ని కస్టమర్లతో పంచుకోవడానికి ఈ కొత్త వేరియంట్‌ను తీసుకువచ్చారు. ఇందులో వినియోగదారులకు కావాల్సిన అన్ని రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను సంస్థ కల్పించింది. కేవలం పెట్రోల్ మాత్రమే కాకుండా డీజిల్, టాటా వారి వినూత్న ట్విన్ సిలిండర్ ఐసిఎన్‌జి ఆప్షన్లలో కూడా ఈ కారు అందుబాటులో ఉంది. మాన్యువల్, ఆటోమేటిక్ (AMT) ట్రాన్స్‌మిషన్లు కూడా కస్టమర్ల సౌలభ్యం కోసం సిద్ధంగా ఉన్నాయి.
కొత్త నెక్సాన్Pure+ PS లో కేవలం సన్‌రూఫ్ మాత్రమే కాదు, మరిన్ని ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో 10.25 అంగుళాల హార్మన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేను సపోర్ట్ చేస్తుంది. మ్యూజిక్ లవర్స్ కోసం 6-స్పీకర్ల ఆడియో సిస్టమ్, సుదూర ప్రయాణాల్లో సౌకర్యం కోసం క్రూయిజ్ కంట్రోల్, వర్షాకాలంలో ఉపయోగపడేలా ఫ్రంట్ అండ్ రియర్ రెయిన్ సెన్సింగ్ వైపర్లు కూడా ఉన్నాయి. వాయిస్ అసిస్టెడ్ ఫీచర్ ద్వారా సన్‌రూఫ్ ని కంట్రోల్ చేయడం మరింత సులభం.
వేరియంట్ల వారీగా ధరలు (ఎక్స్-షోరూమ్)
* పెట్రోల్ MT: రూ. 9.59 లక్షలు
* పెట్రోల్ AMT: రూ. 10.14 లక్షలు
* ట్విన్ సిలిండర్ iCNG MT: రూ. 10.39 లక్షలు
* డీజిల్ MT: రూ. 10.54 లక్షలు
* డీజిల్ AMT: రూ. 11.19 లక్షలు
నెక్సాన్ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి, ఎలక్ట్రిక్ అనే నాలుగు రకాల ఇంధన ఆప్షన్లలో లభించే దేశంలోని ఏకైక ఎస్‌యూవీగా గుర్తింపు పొందింది. ఇది మార్కెట్లో మారుతీ సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

