Tata : హ్యాకర్ల దెబ్బకు జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఢమాల్.. కార్ల తయారీకి బ్రేక్
కార్ల తయారీకి బ్రేక్

Tata : సైబర్ దాడులు ఈ రోజుల్లో సాధారణంగా మారాయి. కంపెనీలను, ప్రభుత్వ వ్యవస్థలను టార్గెట్ చేసే హ్యాకర్లు, ఇప్పుడు లగ్జరీ కార్ల తయారీ సంస్థలను కూడా వదలడం లేదు. దీనికి తాజా ఉదాహరణ, టాటా మోటార్స్ యాజమాన్యంలోని బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR). సెప్టెంబర్ 2న జరిగిన సైబర్ దాడి కారణంగా కంపెనీ తన కార్ల ఉత్పత్తిని అక్టోబర్ 1, 2025 వరకు నిలిపివేసింది.
గతంలో సెప్టెంబర్ 16న, కంపెనీ ఉత్పత్తిని సెప్టెంబర్ 24 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కానీ దాడి ప్రభావం ఇంకా తీవ్రంగా ఉండడంతో, ఈ కాలాన్ని పొడిగించింది. ఈ నిర్ణయం వల్ల కంపెనీ కార్యకలాపాలపై మరింత స్పష్టత వస్తుందని, సమస్య పరిష్కారానికి సమయం దొరుకుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ సైబర్ దాడి వల్ల కంపెనీకి ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లింది. బ్రిటన్‌లో ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ మూడు ఫ్యాక్టరీలలో రోజుకు సుమారు 1,000 కార్లు తయారవుతాయి. ఉత్పత్తి ఆగిపోవడం వల్ల కంపెనీకి కోట్లాది రూపాయల నష్టం వస్తోంది. అంతేకాకుండా, 33,000 మంది ఉద్యోగులలో చాలా మంది ఇంటి దగ్గరే ఉండాలని కంపెనీ కోరింది.
జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఈ సైబర్ దాడిని ఎదుర్కోవడానికి సైబర్ సెక్యూరిటీ నిపుణులు, నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ (NCSC), ఇతర భద్రతా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. కార్యకలాపాలను సజావుగా తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
