Tata Punch: భారతీయ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ సంస్థకు చెందిన ప్రముఖ మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ సరికొత్త సంచలనం సృష్టించింది. నూతన ఆర్థిక సంవత్సరం 2027 మొదటి అర్ధభాగంలో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 మధ్య కాలంలో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఆరు నెలల వ్యవధిలో ఏకంగా 1,23,287 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే విక్రయాలలో దాదాపు 67.84 శాతం భారీ వార్షిక వృద్ధిని సాధించి ఆటోమొబైల్ రంగంలో అందరి దృష్టిని ఆకర్షించింది.

మస్క్యులర్ డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లు

టాటా పంచ్ కారును చూడగానే ఆకట్టుకునేలా బోల్డ్ అలాగే మస్క్యులర్ ఎస్‌యూవీ డిజైన్‌తో రూపొందించారు. కారు ముందు భాగంలో ఆకర్షణీయమైన గ్రిల్, ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌లు ఉంటాయి. దీనికి తోడు 193 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా రోడ్డుపై దీనికి ప్రత్యేక లుక్‌ను ఇస్తాయి. కేబిన్ లోపల అత్యాధునిక సదుపాయాలు కల్పించారు. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేసే 10.25 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. చిన్న కుటుంబాలకు నగరాల్లో డ్రైవింగ్ చేయడానికి ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

పవర్ ఫుల్ ఇంజిన్, అద్భుతమైన మైలేజ్

ఈ కారులో 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇచ్చారు. ఇది 87bhp పవర్‌ను, 115Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు పవర్ ఫుల్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ అలాగే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారి కోసం ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో కూడిన సీఎన్‌జీ (CNG) వేరియంట్ కూడా ఉంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు సుమారు 20 కిలోమీటర్లు, సీఎన్‌జీ వేరియంట్ కిలోకు 26 కిలోమీటర్లకు పైగా మైలేజ్ అందిస్తుంది.

5-స్టార్ సేఫ్టీ రేటింగ్,, ధర వివరాలు

భద్రతా ప్రమాణాల విషయంలో టాటా పంచ్ అత్యంత నమ్మకమైన కారుగా పేరు తెచ్చుకుంది. గ్లోబల్ ఎన్‌క్యాప్ అలాగే భారత్ ఎన్‌క్యాప్ క్ర్యాష్ టెస్ట్‌లలో ఈ కారు ప్రతిష్టాత్మక 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. బేస్ మోడల్ నుంచి ప్రారంభించి అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ప్రామాణికంగా లభిస్తాయి. భారత మార్కెట్లో ఈ మైక్రో ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్ షోరూం ధర రూ.5.69 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్‌కు రూ.10.67 లక్షల వరకు ఉంటుంది.

Next Story