Tata Punch : ఇండియన్ ఆటో మార్కెట్లో టాటా పంచ్ సునామీ.. 8 లక్షల మైలురాయి దాటిన పాపులర్ ఎస్‌యూవీ
8 లక్షల మైలురాయి దాటిన పాపులర్ ఎస్‌యూవీ

Tata Punch : భారతీయ ఆటోమొబైల్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ టాటా మోటార్స్ అత్యంత చౌకైన మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ మార్కెట్లో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. లాంచ్ అయిన ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే ఈ కారు ఏకంగా 8 లక్షల విక్రయాల మార్కును దాటి భారత్‌లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. టాటా నెట్సన్ మోడల్ తర్వాత కంపెనీ పోర్ట్‌ఫోలియో నుంచి ఈ మైలురాయిని చేరుకున్న రెండవ ఎస్‌యూవీగా టాటా పంచ్ నిలిచింది.
టాటా పంచ్ కారును మొదటిసారిగా అక్టోబర్ 2021లో మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 7 లక్షల సేల్స్ నమోదు చేయగా, ఆ తర్వాత కేవలం ఐదు నెలల వ్యవధిలోనే మరో 1 లక్ష యూనిట్లు అమ్ముడుపోవడం దీని డిమాండ్‌కు అద్దం పడుతోంది. ముఖ్యంగా జూన్ 2026 నాటికి 21,006 యూనిట్ల విక్రయాలు సాధించి, 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (Q1 FY27) ఏకంగా 60,321 యూనిట్ల అమ్మకాలతో భారత్‌లోనే అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా నిలిచింది.
ఈ అపారమైన ప్రజాదరణకు జనవరి 2026లో లాంచ్ అయిన ఫేస్‌లిఫ్ట్ మోడల్ ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. నయా డిజైన్, ఆకట్టుకునే ఇంటీరియర్, సరికొత్త ఇంజిన్ ఆప్షన్లతో వచ్చిన ఈ మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.59 లక్షలుగా ఉంది. ప్రస్తుతం టాటా పంచ్ కారు పెట్రోల్ (రూ.5.70 లక్షలు), సీఎన్‌జీ (రూ. 6.80 లక్షలు), ఎలక్ట్రిక్ వేరియంట్ (పంచ్ ఈవీ - రూ. 9.69 లక్షలు) అనే మూడు వేర్వేరు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో లభిస్తోంది.
సాంకేతిక వివరాల పరంగా, కొత్త పంచ్‌లో 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (120 HP), సీఎన్‌జీ వర్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇది పెట్రోల్ మోడల్‌లో లీటరుకు 18.8 నుండి 20.09 కిమీ, సీఎన్‌జీలో కేజీకి 26.99 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, డిజిటల్ క్లస్టర్, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి హంగులు ఉన్నాయి. దీనికి తోడు భారత్ NCAP ప్రయోగాల్లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించడం ఈ కారును భారతీయ కుటుంబాలకు అత్యంత సురక్షితమైన మైక్రో ఎస్‌యూవీగా మార్చింది.

