Tata Punch : భారతదేశంలో చిన్న సైజ్ కార్లు ముఖ్యంగా సబ్-4 మీటర్ ఎస్‌యూవీల డిమాండ్ రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతోంది. జూన్ 2026 నెలలో ఈ విభాగంలో కార్ల అమ్మకాలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఈ రేసులో టాటా మోటార్స్ కు చెందిన చిన్న ఎస్‌యూవీ టాటా పంచ్ మార్కెట్‌ను పూర్తిగా శాసించింది. జూన్ నెలలో టాటా పంచ్ ఏకంగా 21,006 యూనిట్ల అమ్మకాలతో నంబర్-1 స్థానాన్ని సొంతం చేసుకుంది. గత ఏడాది జూన్ నెల అమ్మకాలతో పోలిస్తే ఈసారి ఏకంగా 101 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. అంటే పంచ్ కార్ల అమ్మకాలు కేవలం ఏడాది కాలంలోనే రెట్టింపు అయ్యాయి. ఈ విభాగంలో 20 వేల మార్కును దాటిన ఏకైక కారుగా టాటా పంచ్ సరికొత్త చరిత్ర సృష్టించింది.

మార్కెట్లో సబ్-4 మీటర్ ఎస్‌యూవీల హవా

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ గణాంకాల ప్రకారం.. జూన్ 2026లో మొత్తం సబ్-4 మీటర్ ఎస్‌యూవీల విభాగంలో 1,10,161 కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే జూన్ నెలతో పోలిస్తే ఈ సెగ్మెంట్ లో అమ్మకాలు సుమారు 35 శాతం పెరిగాయి. ఈ అమ్మకాల జాతరలో టాటా మోటార్స్ హవా స్పష్టంగా కనిపించింది. దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన మొదటి రెండు స్థానాలను టాటా కంపెనీ కార్లే కైవసం చేసుకున్నాయి. టాటా పంచ్ మొదటి స్థానంలో నిలవగా, టాటా నెక్సాన్ రెండవ స్థానాన్ని దక్కించుకుంది. వీటితో పాటు మారుతి ఫ్రాంక్స్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3XO వంటి మోడళ్లు కూడా టాప్-10 జాబితాలో నిలిచి కస్టమర్లను ఆకట్టుకున్నాయి.

టాప్-3లో నిలిచిన టాటా నెక్సాన్, మారుతి ఫ్రాంక్స్

ఈ సేల్స్ రిపోర్టులో టాటా నెక్సాన్ 18,335 యూనిట్ల విక్రయాలతో రెండవ స్థానంలో నిలిచింది. గత ఏడాది జూన్ అమ్మకాలతో పోలిస్తే నెక్సాన్ 58 శాతం వృద్ధిని కనబరిచింది. అయితే మే నెలతో పోలిస్తే జూన్ లో దీని అమ్మకాలు కొద్దిగా తగ్గాయి. ఇక మూడవ స్థానంలో మారుతి సుజుకికి చెందిన ఫ్రాంక్స్ నిలిచింది. జూన్ నెలలో ఈ కారు 13,135 యూనిట్లు అమ్ముడైంది. ఏడాది ప్రాతిపదికన ఫ్రాంక్స్ 34 శాతం వృద్ధిని సాధించినప్పటికీ, మే నెల అమ్మకాలతో పోలిస్తే జూన్ లో దీని విక్రయాలు భారీగా పడిపోవడం మారుతి కంపెనీని కాస్త ఆలోచనలో పడేసింది.

హ్యుందాయ్ వెన్యూతో మహీంద్రా XUV 3XO ఢీ

ఈ అమ్మకాల పోటీలో హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3XO మధ్య గట్టి పోటీ నడిచింది. హ్యుందాయ్ వెన్యూ 10,776 యూనిట్ల అమ్మకాలతో నాల్గవ స్థానాన్ని దక్కించుకోగా, గత ఏడాదితో పోలిస్తే 57 శాతం వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు మహీంద్రా XUV 3XO అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. మే నెలలో కేవలం 6,717 యూనిట్లు అమ్ముడైన ఈ కారు, జూన్ నెలకొచ్చేసరికి ఏకంగా 10,063 యూనిట్లకు చేరుకుంది. అంటే కేవలం ఒక్క నెల వ్యవధిలోనే మహీంద్రా కార్ల అమ్మకాలు దాదాపు 50 శాతం పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే దీని అమ్మకాల్లో 42 శాతం పెరుగుదల కనిపించింది.

మారుతి బ్రెజ్జా అమ్మకాలు ఎందుకు పడిపోయాయి?

ఒకప్పుడు ఈ సబ్-4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలో రారాజుగా వెలిగిన మారుతి సుజుకి బ్రెజ్జా ఈసారి ఘోరంగా నిరాశపరిచింది. జూన్ నెలలో బ్రెజ్జా కేవలం 9,939 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. గత ఏడాది జూన్ అమ్మకాలతో పోలిస్తే ఈసారి ఏకంగా 31 శాతం అమ్మకాలు పడిపోయాయి. అయితే ఆటోమొబైల్ నిపుణుల సమాచారం ప్రకారం.. మారుతి కంపెనీ త్వరలోనే మార్కెట్లోకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కారణంగానే కస్టమర్లు కొత్త మోడల్ కోసం ఎదురుచూస్తుండటంతో ప్రస్తుత మోడల్ అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తోంది.

కియా సోనెట్, హ్యుందాయ్ ఎక్స్టర్ పరిస్థితి ఏంటి?

టాప్ జాబితాలో నిలిచిన మిగిలిన కార్ల వివరాలు చూస్తే.. కియా సోనెట్ జూన్ లో 9,231 యూనిట్ల అమ్మకాలతో పర్వాలేదనిపించింది. అలాగే హ్యుందాయ్ ఎక్స్టర్ 8,154 యూనిట్లు, ఇటీవల మార్కెట్లోకి వచ్చిన స్కోడా కైలాక్ 4,039 యూనిట్ల విక్రయాలను నమోదు చేశాయి. కాగా టయోటా టైజర్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్, కియా సైరోస్, మారుతి జిమ్నీ వంటి మోడళ్లు ఆశించిన స్థాయిలో కస్టమర్లను ఆకట్టుకోలేకపోయాయి. వీటి అమ్మకాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. మొత్తానికి జూన్ 2026 కార్ల మార్కెట్ మాత్రం టాటా పంచ్ జోరుతో ఊగిపోయింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story