Tata Punch EV : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు పక్కా..పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది
పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది

Tata Punch EV : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న టాటా మోటార్స్, తన అత్యంత ప్రజాదరణ పొందిన పంచ్ ఈవీని సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. 2026 సంవత్సరాన్ని గ్రాండ్‌గా ప్రారంభించిన టాటా, ఫిబ్రవరి 20న పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కేవలం లుక్స్ మాత్రమే కాదు, రేంజ్ విషయంలోనూ ఈసారి టాటా సంచలనం సృష్టించబోతోంది. ప్రస్తుతం ఉన్న పంచ్ ఈవీలో 25 kWh, 35 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. అయితే కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో టాటా మోటార్స్ పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. ఇందులో 40.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చే ఛాన్స్ ఉంది. దీనివల్ల ప్రస్తుతం ఉన్న 421 కిలోమీటర్ల రేంజ్ కాస్తా పెరిగి, ఏకంగా 500 కిలోమీటర్ల మార్కును తాకనుంది. అదే జరిగితే, తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ కారుగా పంచ్ ఈవీ రికార్డు సృష్టిస్తుంది.
ఎక్స్‌టీరియర్ పరంగా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ మరింత స్టైలిష్‌గా మారబోతోంది. ముందు భాగంలో కొత్తగా డిజైన్ చేసిన క్లోజ్డ్ గ్రిల్, కనెక్టెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఆకర్షణీయమైన కొత్త అల్లాయ్ వీల్స్‌ను మనం చూడవచ్చు. ముందు, వెనుక బంపర్లను కూడా మార్చబోతున్నారు. సేఫ్టీ విషయంలో రాజీ పడకుండా, లాంగ్ రేంజ్ వెర్షన్‌లో నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్ సౌకర్యాన్ని కొనసాగించనున్నారు.
కారు లోపలి భాగంలో టాటా భారీ మార్పులు చేస్తోంది. ఇప్పుడున్న దానికంటే పెద్దదైన 12.3 ఇంచ్ ఫ్రీ-స్టాండింగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్‌ను అమర్చబోతున్నారు. మ్యూజిక్ ప్రియుల కోసం సబ్ వూఫర్‌తో కూడిన ప్రీమియం హర్మాన్ కార్డాన్ మ్యూజిక్ సిస్టమ్ రానుంది. వినియోగదారుల కోరిక మేరకు ఈసారి పనోరమిక్ సన్‌రూఫ్ ఆప్షన్‌ను కూడా ఇచ్చే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా, ఇందులో లెవల్-2 ADAS సేఫ్టీ ఫీచర్లను జత చేసే ఆలోచనలో టాటా ఉంది. దీనివల్ల ప్రయాణం మరింత సురక్షితం అవుతుంది.
ప్రస్తుతం పంచ్ ఈవీ ధర రూ.9.99 లక్షల నుంచి రూ.14.44 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కొత్త ఫీచర్లు, పెద్ద బ్యాటరీ కారణంగా, ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధర స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. అయితే మహీంద్రా 3XO EV, ఎంజీ విండ్సర్ ఈవీ వంటి ప్రత్యర్థులను తట్టుకోవడానికి టాటా ధరను పోటీగానే ఉంచుతుందని మార్కెట్ వర్గాల అంచనా. ఫిబ్రవరి 20న ఈ మిస్టరీ వీడనుంది.

