Tata Punch: మళ్లీ రికార్డులు తిరగరాసిన టాటా పంచ్.. ఫ్రాంక్స్, నెక్సాన్‌లను దాటుకుని నంబర్ 1 పొజిషన్
నంబర్ 1 పొజిషన్

Tata Punch: భారతదేశంలో 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండే సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. టాటా, మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా, కియా, టయోటా వంటి ప్రముఖ సంస్థలు ఈ విభాగంలో పలు మోడళ్లను విక్రయిస్తున్నాయి. అయితే జులై 2026 అమ్మకాల గణాంకాల ప్రకారం టాటా మోటార్స్ చిన్న ఎస్‌యూవీ టాటా పంచ్ తన ఆధిపత్యాన్ని పునరావృతం చేస్తూ మళ్లీ దేశంలోనే నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. జులై నెలలో ఏకంగా 21,313 యూనిట్ల పంచ్ ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి.
97.6 శాతం వార్షిక వృద్ధి నమోదు
గత ఏడాది జులై నెలలో టాటా పంచ్ కేవలం 10,785 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఈ ఏడాది జులై నాటికి ఏకంగా 97.6 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఈ అద్భుతమైన విక్రయాలతో మొత్తం సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో టాటా పంచ్ ఒక్కటే 18.3 శాతం వాటాను దక్కించుకుంది. వినియోగదారుల నుంచి అందుతున్న ఆదరణే పంచ్‌ను నిలకడగా అగ్రస్థానంలో నిలబెడుతోంది.
రెండో స్థానంలో మారుతి ఫ్రాంక్స్
జులై సేల్స్ గణాంకాలలో అతిపెద్ద మార్పు రెండో స్థానంలో చోటుచేసుకుంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ మోడల్, టాటా నెక్సాన్‌ను అధిగమించి రెండో స్థానానికి చేరుకుంది. ఫ్రాంక్స్ జులై నెలలో 19,473 యూనిట్ల అమ్మకాలతో 51.3 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. కాగా, టాటా నెక్సాన్ 17,471 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానానికి పడిపోయింది. నెక్సాన్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 36.2 శాతం పెరిగినప్పటికీ, ఫ్రాంక్స్ చూపిన వేగం ముందు వెనుకబడింది. మార్కెట్లో నెక్సాన్ వాటా దాదాపు 15 శాతంగా ఉంది.
బ్రెజ్జా అమ్మకాల తగ్గుదల
మరోవైపు, ఒకప్పుడు ఈ విభాగంలో రాజుగా వెలిగిన మారుతి సుజుకి బ్రెజ్జా అమ్మకాలలో తగ్గుదల కనిపించింది. జులైలో 12,055 యూనిట్లు మాత్రమే అమ్ముడై బ్రెజ్జా నాలుగో స్థానానికి చేరింది. గత ఏడాది 14,065 యూనిట్లు విక్రయించిన బ్రెజ్జా, ఈసారి 14.3 శాతం తగ్గుదల నమోదు చేసింది. కొత్త టర్బో-పెట్రోల్ ఇంజిన్, ఆధునిక ఫీచర్లతో అప్‌డేట్ అయినప్పటికీ బ్రెజ్జా విక్రయాలు తగ్గాయి. హ్యుందాయ్ వెన్యూ 11,095 యూనిట్లతో ఐదో స్థానంలో నిలవగా, ఆ తర్వాత మహీంద్రా XUV 3XO, కియా సోనెట్, హ్యుందాయ్ ఎక్స్‌టర్, స్కోడా కైలాక్, టయోటా టైసర్ టాప్-10 సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీల జాబితాలో నిలిచాయి.

