Tata Safari EV: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు లభిస్తున్న ఆదరణను చూసి దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది. తన పాపులర్ త్రీ-రో ఫ్యామిలీ ఎస్‌యూవీ 'సఫారీ'ని పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ అవతారంలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఈ కొత్త టాటా సఫారీ ఈవీ 2027 జనవరి నెలలో భారత మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది. మహీంద్రా నుంచి రాబోతున్న మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఎస్ మోడల్‌కు ఇది ప్రధాన పోటీదారుగా నిలవడమే కాకుండా టాటా ఈవీ పోర్ట్‌ఫోలియోలో టాప్ మోడల్‌గా స్థానం సంపాదించుకోనుంది.

టాటా సఫారీ ఈవీలో అత్యంత ప్రధానమైన అంశం దాని బ్యాటరీ సామర్థ్యం అలాగే మైలేజ్ రేంజ్. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఇందులో 65 kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్‌లతో పాటు టాప్ వేరియంట్‌లో భారీ 80 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పెద్ద బ్యాటరీ సాయంతో ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో రేంజ్ లభిస్తే నగరాల్లో రోజువారీ వాడకంతో పాటు లాంగ్ డ్రైవ్‌లు చేసే వారికి చార్జింగ్ సమస్యలు లేకుండా అద్భుతమైన ప్రయాణ అనుభూతి లభిస్తుంది.

సఫారీ ఈవీని టాటా అడ్వాన్స్‌డ్ ఆక్టివ్ ఈవీ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుతున్నారు. ఇప్పటికే మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్న హారియర్ ఈవీని కూడా ఇదే వేదికపై నిర్మించారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో రియర్ వీల్ డ్రైవ్ (RWD), ఆల్ వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్‌లో ముందు, వెనుక చక్రాలకు వేర్వేరుగా ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చడం ద్వారా రోడ్డుపై మెరుగైన గ్రిప్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ లభిస్తుంది. ఎగుడు దిగుడు రోడ్లపై కూడా ఈ కారు అత్యంత సునాయాసంగా దూసుకుపోగలదు.

కేబిన్ అంతర్భాగం విషయానికి వస్తే టాటా సఫారీ ఈవీని అత్యంత ప్రీమియం లుక్‌తో డిజైన్ చేస్తున్నారు. డ్యాష్‌బోర్డ్ పై మూడు స్క్రీన్ల సెటప్ రాబోతోందని స్పై షాట్స్ ద్వారా తెలుస్తోంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు ఫ్రంట్ ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా మరో డిస్‌ప్లే స్క్రీన్ అమర్చనున్నారు. వీటితో పాటు లార్జ్ పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ప్రీమియం ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, 540-డిగ్రీ కెమెరా, డిజిటల్ ఆర్‌విఎమ్ వంటి అత్యాధునిక హంగులు ఈ కార్‌లో భాగం కానున్నాయి.

ప్రయాణికుల భద్రతకు టాటా మోటార్స్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. సఫారీ ఈవీలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ టెక్నాలజీని అందించనున్నారు. దీనివల్ల ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 20 లక్షల నుంచి రూ. 23 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. టాప్ వేరియంట్ AWD మోడల్ ధర దాదాపు రూ. 30 లక్షల నుంచి రూ. 32 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story