Tata Safari EV : భారత రోడ్లపై టాటా సఫారీ ఈవీ హల్చల్.. టెస్టింగ్ దశలో దొరికిపోయిన కొత్త కారు
టెస్టింగ్ దశలో దొరికిపోయిన కొత్త కారు

Tata Safari EV : భారతదేశపు నంబర్ వన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ఈవీ లైనప్‌ను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ ఎస్‌యూవీ సఫారీని ఎలక్ట్రిక్ రూపంలో తీసుకురాబోతోంది. తాజాగా టాటా సఫారీ ఈవీ మొదటిసారిగా భారతీయ రహదారులపై రోడ్ టెస్టింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. రాబోయే పండగ సీజన్ నాటికి మార్కెట్లోకి విడుదల కానున్న ఈ కారు, టాటా బ్రాండ్ నుంచి రాబోతున్న మొట్టమొదటి 3-రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కావడం విశేషం. ప్రీమియం ఈవీ సెగ్మెంట్‌లో రాబోయే మహింద్రా XEV 9S మోడల్‌కు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.
ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో సరికొత్త లుక్
లీకైన టెస్టింగ్ ఫోటోల ప్రకారం.. కొత్త సఫారీ ఈవీ బాహ్య రూపం ప్రస్తుత డీజిల్ మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, దీనిని ప్యూర్ ఈవీగా చూపించడానికి కంపెనీ అనేక కీలక మార్పులు చేసింది. ఈ కారులో త్వరలో రాబోయే హారియర్ ఈవీ తరహాలోనే క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, సరికొత్తగా డిజైన్ చేసిన బంపర్, గాలి ఒత్తిడిని తట్టుకునేలా ఉండే ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, ప్రత్యేకమైన ఈవీ బ్యాజింగ్‌లను అందించనున్నారు. కారు పొడవు, వెడల్పు పాత మోడల్ లాగే ఉండటం వల్ల లోపల కేబిన్ స్పేస్, లగేజ్ పెట్టుకునే స్థలం చాలా విశాలంగా ఉంటుంది.
అత్యాధునిక సాఫ్ట్‌వేర్, కేబిన్ ఫీచర్లు
కారు ఇంటీరియర్ విషయానికి వస్తే, టాటా సఫారీ ఈవీలో అల్ట్రా-మోడ్రన్ ఫీచర్ల వర్షం కురిపించబోతోంది. ఈ ఎస్‌యూవీలో టాటా సంస్థకు చెందిన సరికొత్త TiDAL (టాటా ఇంటెలిజెంట్ డిజిటల్ ఆర్కిటెక్చర్ లేయర్) సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించనున్నారు. దీనివల్ల కారులో అడ్వాన్స్‌డ్ కనెక్టెడ్-కార్ ఫంక్షన్స్, ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్స్ సులభంగా అందుతాయి. వీటితో పాటు భారీ సైజ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డాల్బీ అట్మోస్ టెక్నాలజీతో కూడిన ప్రీమియం జేబీఎల్ (JBL) ఆడియో సెటప్, కారు నుంచి ఇతర వస్తువులకు, ఇతర కార్లకు పవర్ ఇచ్చే V2L, V2V ఛార్జింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
డ్రైవింగ్‌ను సులభతరం చేసే హైటెక్ ఫీచర్లు
ప్రయాణాన్ని మరింత లగ్జరీగా మార్చేందుకు ఈ కార్లో ఆటో పార్క్ అసిస్ట్, కారును రిమోట్‌గా పిలుచుకునే సమన్ మోడ్, కారు చుట్టూ 360 డిగ్రీల కంటే ఎక్కువ నిఘా ఉంచే 540-డిగ్రీ కెమెరా సిస్టమ్, అత్యంత సురక్షితమైన అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) హై-టెక్నాలజీని అమర్చారు. ఇవన్నీ డ్రైవర్‌కు ఎలాంటి శ్రమ లేకుండా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
పవర్‌ఫుల్ బ్యాటరీ, 600 కిమీల మైలేజ్ రేంజ్
టాటా సఫారీ ఈవీ పవర్‌ట్రైన్ ఆప్షన్లు చాలా బలంగా ఉండబోతున్నాయి. నివేదికల ప్రకారం.. టాటా సంస్థ ఇందులో 65 kWh,75 kWh సామర్థ్యం గల రెండు రకాల భారీ బ్యాటరీ ప్యాక్‌లను పరిచయం చేసే అవకాశం ఉంది. దీని రియర్-వీల్-డ్రైవ్ (RWD) వేరియంట్ దాదాపు 235 హార్స్‌పవర్‌ను జనరేట్ చేస్తుంది. అలాగే దీని టాప్ మోడల్ అయిన డ్యూయల్-మోటర్ ఆల్-వీల్-డ్రైవ్ (AWD) వేరియంట్ ఏకంగా 390 హార్స్‌పవర్, 504 Nm టాప్ టార్క్‌ను విడుదల చేస్తుంది. మైలేజ్ రేంజ్ విషయానికి వస్తే, బేస్ వేరియంట్లు సింగిల్ ఛార్జ్‌పై 500 కిలోమీటర్లు, హై-స్పెసిఫికేషన్ వేరియంట్లు ఏకంగా 600 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది.
లాంచ్ టైమ్‌లైన్, ధరల అంచనా
టాటా మోటర్స్ ఈ సఫారీ ఈవీని 2026 పండగ సీజన్ (దసరా, దీపావళి) నాటికి మార్కెట్లోకి లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. హారియర్ ఈవీ కంటే పై కేటగిరీలో రాబోతున్న ఈ సఫారీ ఈవీ, టాటా కంపెనీకి ఒక ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలవనుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 22 లక్షల నుంచి ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత మార్కెట్లో విడుదలైన తర్వాత ఇది నేరుగా మహీంద్రా కంపెనీకి చెందిన XEV 9S ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో తలపడనుంది.

