Tata Sierra : టాటా సియెర్రా కొంటున్నారా? ఈ వారంటీ లోగుట్టు తెలియకపోతే జేబు ఖాళీ అవ్వడం ఖాయం
ఈ వారంటీ లోగుట్టు తెలియకపోతే జేబు ఖాళీ అవ్వడం ఖాయం

Tata Sierra : టాటా మోటార్స్ తన గర్వకారణమైన సియెర్రాను మార్కెట్లోకి తెచ్చి మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కారుతో పాటు కంపెనీ 3 ఏళ్లు లేదా 1,00,000 కిలోమీటర్ల వరకు స్టాండర్డ్ వారంటీని అందిస్తోంది. ఇది వినడానికి బానే ఉన్నా, దీర్ఘకాలంలో కారును వాడుకోవాలనుకునే వారికి ఇది సరిపోదు. అందుకే ఎక్స్‌టెండెడ్ వారంటీ అనే ఆప్షన్‌ను టాటా ఇస్తోంది. కానీ ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. ఆ మెలిక ఏంటో తెలియక చాలా మంది కస్టమర్లు తర్వాత భారీగా సర్ఛార్జీలు కడుతున్నారు.
టాటా సియెర్రా వారంటీ విషయంలో కంపెనీ ఒక క్లియర్ డెడ్‌లైన్ పెట్టింది. మీరు కారు కొన్న 90 రోజుల లోపు గనుక ఎక్స్‌టెండెడ్ వారంటీ తీసుకుంటే ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు. ఒకవేళ 90 నుంచి 180 రోజుల మధ్య తీసుకుంటే 10 శాతం సర్ఛార్జ్ కట్టాలి. అదే 180 రోజులు దాటిన తర్వాత వారంటీ తీసుకోవాలనుకుంటే ఏకంగా 20 శాతం ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీరు ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత ఎక్కువ డబ్బులు ఆదా అవుతాయి. అందుకే సియెర్రాను బుక్ చేసుకున్నప్పుడే ఈ ప్లాన్ కూడా తీసుకోవడం తెలివైన పని.
ధరల విషయానికి వస్తే.. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్‌కు ఎక్స్‌టెండెడ్ వారంటీ సుమారు రూ.20,220 నుంచి ప్రారంభమవుతుంది. అదే డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ అయితే రూ.24,400 వరకు ఉండవచ్చు. ఒకవేళ మీరు 2 ఏళ్లు లేదా 1.25 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ కావాలనుకుంటే ధర రూ.25,000 నుంచి రూ.34,000 వరకు మారుతూ ఉంటుంది. ఇంజిన్, గేర్‌బాక్స్ రకాన్ని బట్టి ఈ ధరల్లో మార్పులు ఉంటాయి.
అసలు ఈ వారంటీ తీసుకోవడం అవసరమా? అని మీకు సందేహం రావచ్చు. నేటి ఆధునిక కార్లలో ఎలక్ట్రానిక్ విడిభాగాలు ఎక్కువగా ఉంటాయి. వారంటీ పీరియడ్ దాటిన తర్వాత ఇంజిన్ లేదా గేర్‌బాక్స్‌లో ఏవైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటి రిపేర్ ఖర్చు వేలల్లో ఉంటుంది. అదే మీ దగ్గర ఎక్స్‌టెండెడ్ వారంటీ ఉంటే, మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా నిశ్చింతగా ఉండవచ్చు. ముఖ్యంగా సియెర్రా వంటి ప్రీమియం ఎస్‌యూవీల రిపేర్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఈ సీక్రెట్ ప్లాన్‌ను ఉపయోగించుకోవడం ద్వారా మీ జేబుకు చిల్లు పడకుండా చూసుకోవచ్చు.

