Tata Sierra : టాటా సియెర్రా బుకింగ్స్ లో ఊచకోత..జనవరి 15 నుంచి డెలివరీల జోరు
జనవరి 15 నుంచి డెలివరీల జోరు

Tata Sierra : 90వ దశకంలో భారతీయ యువత కలల వాహనంగా నిలిచిన టాటా సియెర్రా ఇప్పుడు సరికొత్త హంగులతో, ఆధునిక టెక్నాలజీతో మళ్లీ మన ముందుకు వచ్చేసింది. దీనికి ఉన్న విపరీతమైన క్రేజ్ ఎంతలా ఉందంటే, బుకింగ్స్ ప్రారంభించిన కేవలం 24 గంటల్లోనే ఏకంగా 70,000 మంది కస్టమర్లు దీనిని సొంతం చేసుకునేందుకు ముందుకు వచ్చారు. సుమారు 13 లక్షల మంది ఆటోమొబైల్ ప్రియులు ఈ కారు కాన్ఫిగరేషన్ల కోసం ఆసక్తి చూపడం చూస్తుంటే, 2026 ఏడాదికి ఇదే అతిపెద్ద లాంచ్ అని స్పష్టమవుతోంది. ఈ ఐకానిక్ ఎస్‌యూవీ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే, ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా అత్యంత శక్తివంతమైన మోడల్‌గా రూపాంతరం చెందింది.
డిజైన్ విషయానికి వస్తే.. కొత్త సియెర్రా తన క్లాసిక్ బాక్సీ రూపాన్ని కాపాడుకుంటూనే మరింత గ్లామరస్‌గా తయారైంది. ముందు భాగంలో అమర్చిన కనెక్టెడ్ ఎల్‌ఈడీ హెడ్ లైట్లు, గ్లోసీ బ్లాక్ ఫినిషింగ్ కారుకు ఒక ప్రీమియం, రాజసం ఉట్టిపడే లుక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా ఈ కారులో ఉన్న పనోరమిక్ సన్‌రూఫ్ భారతదేశంలోనే అతిపెద్దది కావడం విశేషం. టైర్ల డిజైన్ నుంచి డోర్ హ్యాండిల్స్ వరకు ప్రతి చిన్న అంశాన్ని టాటా మోటార్స్ చాలా స్టైలిష్‌గా, దృఢంగా తీర్చిదిద్దింది.
ఇక కారు లోపలి భాగం ఒక లగ్జరీ హోటల్ లాంజ్‌ను తలపిస్తుంది. డ్యాష్‌బోర్డ్‌పై డ్రైవర్ సమాచారం కోసం ఒకటి, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రెండు.. ఇలా మొత్తం మూడు డిస్‌ప్లేలు ఏర్పాటు చేశారు. సంగీత ప్రియుల కోసం 12 స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్, సోనిక్‌షాఫ్ట్ సౌండ్‌బార్ అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. టాటా కర్వ్ మోడల్‌లో ఉన్నట్లుగా వెలిగే లోగోతో కూడిన 4-స్పోక్ స్టీరింగ్ వీల్, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని అత్యంత సౌకర్యవంతంగా మారుస్తాయి.
పెర్ఫార్మెన్స్ పరంగా కూడా సియెర్రా ఏమాత్రం తగ్గడం లేదు. ఇందులో మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లను అందుబాటులో ఉంచారు. వేగాన్ని ఇష్టపడే వారి కోసం 160 HP పవర్‌నిచ్చే 1.5L టర్బో పెట్రోల్ ఇంజిన్, సిటీ డ్రైవింగ్ కోసం 106 HPనిచ్చే నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, ఎక్కువ మైలేజీ కోరుకునే వారి కోసం 118 HP పవర్‌నిచ్చే 1.5L డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. దీనివల్ల కస్టమర్లు తమ అవసరాలకు తగ్గట్టుగా నచ్చిన వేరియంట్‌ను ఎంచుకునే వీలుంటుంది.
ధర విషయానికొస్తే.. టాటా మోటార్స్ ఈ ప్రీమియం ఎస్‌యూవీని సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలా నిర్ణయించింది. టాటా సియెర్రా ప్రారంభ ధర రూ.11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్ మోడల్ ధర రూ.21.29 లక్షల వరకు ఉంటుంది. ఇది స్మార్ట్+, ప్యూర్, అడ్వెంచర్, అకాంప్లిష్డ్ అనే నాలుగు వైవిధ్యమైన వేరియంట్లలో లభిస్తోంది. పాత తరం జ్ఞాపకాలతో, కొత్త తరం టెక్నాలజీతో వచ్చిన ఈ సియెర్రా రోడ్ల మీద రారాజుగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

