Tata Sierra : పెట్రోల్ వేరియంట్ ఎంత? డీజిల్ ఎంత? RTI ద్వారా బయటపడ్డ టాటా సియెర్రా అసలైన మైలేజీ లెక్కలు
RTI ద్వారా బయటపడ్డ టాటా సియెర్రా అసలైన మైలేజీ లెక్కలు

Tata Sierra : భారత ఆటోమొబైల్ రంగంలో ఐకానిక్ బ్రాండ్ అయిన టాటా సియెర్రా రీ-ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. 2025 నవంబర్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ ఎస్‌యూవీకి సంబంధించి ఒక కీలకమైన విషయం మాత్రం ఇప్పటివరకు మిస్టరీగానే ఉంది. అదే ఈ కారు ఇచ్చే అసలైన మైలేజీ. సాధారణంగా కంపెనీలు లాంచ్ సమయంలోనే ARAI సర్టిఫైడ్ మైలేజీని ప్రకటిస్తాయి. కానీ సియెర్రా విషయంలో టాటా మోటార్స్ మౌనం వహించింది. తాజాగా ఒక నెటిజన్ వేసిన RTI (సమాచార హక్కు చట్టం) ద్వారా ఈ కారు మైలేజీ లెక్కలు బయటపడ్డాయి.
టాటా సియెర్రా లాంచ్ సమయంలో కంపెనీ ఒక అద్భుతమైన రికార్డును ప్రకటించింది. ఇండోర్‌లోని NATRAX ట్రాక్‌పై 12 గంటల పాటు డ్రైవ్ చేసినప్పుడు 1.5L హైపీరియన్ పెట్రోల్ వేరియంట్ ఏకంగా 29.9 kmpl మైలేజీని ఇచ్చి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కిందని తెలిపింది. అయితే, ఇది ఐడియల్ కండిషన్స్‌లో జరిగిన టెస్ట్. తాజాగా ARAI ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 13.5 kmpl మైలేజీని ఇస్తుండగా, 1.5 లీటర్ క్రయోజెట్ డీజిల్ ఇంజిన్ 18.8 kmpl మైలేజీని ఇస్తోంది. ఇంకా 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వేరియంట్‌కు సర్టిఫికేషన్ రావాల్సి ఉంది.
అధికారిక మైలేజీ లెక్కలు తెలియకపోయినా, సియెర్రాపై కస్టమర్ల నమ్మకం ఇసుమంతైనా తగ్గలేదు. కేవలం 24 గంటల్లోనే 70,000 యూనిట్ల బుకింగ్స్ దాటగా, ఇప్పటివరకు 1 లక్షకు పైగా బుకింగ్స్ వచ్చాయి. జనవరి 15, 2026 నుంచి డెలివరీలు ప్రారంభం కాగా, కేవలం కొన్ని వారాల్లోనే 10,000 యూనిట్లను కస్టమర్లకు అందజేసి టాటా మోటార్స్ రికార్డు సృష్టించింది. సియెర్రా బ్రాండ్ వాల్యూ, దాని లుక్స్‌కు జనం ఎంతగా ఫిదా అయ్యారో ఈ గణాంకాలే చెబుతున్నాయి.
ప్రస్తుతం టాటా సియెర్రాను గుజరాత్‌లోని సానంద్ ప్లాంట్‌లో నెక్సాన్‌తో పాటు తయారు చేస్తున్నారు. డిమాండ్ విపరీతంగా ఉండటంతో నెలకు 15,000 యూనిట్లు ఉత్పత్తి చేసేలా ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచుతున్నారు. దీనివల్ల వెయిటింగ్ పీరియడ్ తగ్గే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ వెర్షన్ల విజయంతో ఉత్సాహంగా ఉన్న టాటా.. జూన్ 2026 నాటికి టాటా సియెర్రా ఈవీని కూడా మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇది ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో గేమ్ ఛేంజర్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సియెర్రా పెట్రోల్ మైలేజీ 13.5 kmpl అనేది భారీ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో సాధారణమే అయినప్పటికీ, డీజిల్ వెర్షన్ 18.8 kmpl మైలేజీ ఇవ్వడం సామాన్యులకు ప్లస్ పాయింట్ కానుంది. హైటెక్ ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ ADAS సేఫ్టీ, టాటా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ కలగలిసి ఉండటంతో మైలేజీ కొంచెం అటు ఇటూ అయినా కస్టమర్లు సియెర్రా వైపే మొగ్గు చూపుతున్నారు. రాబోయే ఈవీ వెర్షన్ కోసం కూడా భారీ స్థాయిలో కస్టమర్లు ఎదురుచూస్తున్నారు.

