Tata Sierra EV : ఈనెల 30న టాటా నుంచి మరో ఎలక్ట్రిక్ సంచలనం.. మార్కెట్లోకి రాబోతున్న టాటా సియెర్రా ఈవీ
మార్కెట్లోకి రాబోతున్న టాటా సియెర్రా ఈవీ

Tata Sierra EV : భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌ను శాసిస్తున్న టాటా మోటార్స్ తన పోర్ట్‌ఫోలియోలోకి మరో పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ కారును చేర్చడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఎంతో కాలంగా కస్టమర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త టాటా సియెర్రా ఈవీని జూన్ 30, 2026న భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేయబోతోంది. మొదటగా ఆటో ఎక్స్‌పో 2020లో కాన్సెప్ట్ మోడల్‌గా ప్రదర్శించబడిన ఈ ఐకానిక్ కారు.. ఆ తర్వాత 2023లో మరిన్ని అప్‌డేట్లతో మెప్పించింది. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన సియెర్రా ఐసీఈ (పెట్రోల్-డీజిల్) మోడల్ ఆధారంగానే ఈ సరికొత్త ఫుల్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను టాటా రూపొందించింది.
ఎలక్ట్రిక్ శైలిలో ఫ్యూచరిస్టిక్ డిజైన్
టాటా సియెర్రా ఈవీ డిజైన్ చాలా వరకు సాధారణ మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ.. దీనికి ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ లుక్ ఇవ్వడానికి టాటా డిజైనర్లు పలు మార్పులు చేశారు. సాధారణ కార్లలో ఉండే గ్రిల్స్ కాకుండా.. ఇందులో ముందు భాగంలో పూర్తిగా క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది. దీనితో పాటు సరికొత్త ఫ్రంట్ బంపర్, ప్రత్యేకమైన ఈవీ సిగ్నేచర్ లైటింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. కారు వెనుక భాగంలో, సైడ్‌లో టాటా ఈవీ కార్ల ప్రత్యేకత అయిన .ev బ్యాజింగ్‌ను అందించనున్నారు. కస్టమర్లను ఆకట్టుకోవడానికి సరికొత్త ఏరో-ఎఫిషియంట్ అలాయ్ వీల్స్‌ను కూడా ఇందులో పరిచయం చేసే అవకాశం ఉంది.
ట్రిపుల్ స్క్రీన్ సెటప్‌తో లగ్జరీ ఇంటీరియర్
ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేబిన్ లోపలి భాగం అత్యంత ఆధునిక సాంకేతికతతో, లగ్జరీగా ఉండబోతోంది. ముఖ్యంగా దీని టాప్ వేరియంట్లలో ఆటోమొబైల్ రంగంలోనే అత్యంత క్రేజీగా మారిన ట్రిపుల్ స్క్రీన్ సెటప్ అందించనున్నారు. ఇందులో డ్రైవర్ కోసం 10.25 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మధ్యలో 12.3 ఇంచుల మెయిన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కో-ప్యాసింజర్ (ముందు కూర్చునే ప్రయాణికుడు) కోసం ప్రత్యేకంగా మరొక 12.3 ఇంచుల డిస్‌ప్లే స్క్రీన్‌ను అమర్చనున్నారు. ఇక బేస్, మిడ్ వేరియంట్లలో హెడ్-అప్ డిస్‌ప్లేతో కూడిన డ్యూయల్ స్క్రీన్ సెటప్ లభిస్తుంది.
ఫీచర్ల విషయాల్లో నో కాంప్రమైజ్
కస్టమర్ల సౌకర్యం కోసం టాటా సియెర్రా ఈవీలో లగ్జరీ ఫీచర్లను భారీగా నింపేశారు. ఈ కారులో విశాలమైన పనోరమిక్ సన్రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, విభిన్న రోడ్ల కోసం మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్, థియేటర్ లాంటి ఫీలింగ్ ఇచ్చే ప్రీమియం సౌండ్ సిస్టమ్, అడ్వాన్స్డ్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు ప్రయాణికుల సేఫ్టీ కోసం లెవెల్-2 ఏడీఏఎస్ సేఫ్టీ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందించే అవకాశం ఉంది.
పవర్‌ఫుల్ బ్యాటరీ, ఆల్-వీల్ డ్రైవ్
సాంకేతిక సామర్థ్యం విషయానికి వస్తే.. టాటా సియెర్రా ఈవీని కంపెనీ సరికొత్త acti.ev+ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. ఇదే ప్లాట్‌ఫారమ్‌ను టాటా హారియర్ ఈవీలో కూడా ఉపయోగించారు. సమాచారం ప్రకారం ఈ కారులో 65 kWh, 75 kWh అనే రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు లభించనున్నాయి. ఈ ఎస్‌యూవీ రేర్-వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్లలో వస్తుందని టాటా ఇప్పటికే స్పష్టం చేసింది. పెద్దదైన 75 kWh బ్యాటరీని కేవలం పవర్‌ఫుల్ AWD వెర్షన్లలోనే అందించనున్నారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 500 కిలోమీటర్లకు పైగా రియల్ వరల్డ్ రేంజ్ ఇస్తుందని అంచనా.
ధర ఎంత?.. పోటీ ఎవరితో?
టాటా ఎలక్ట్రిక్ కార్ల లైనప్‌లో ఈ కొత్త సియెర్రా ఈవీ స్థానం కర్వ్ ఈవీకి పైన, హారియర్ ఈవీకి కింద ఉంటుంది. మార్కెట్ అంచనాల ప్రకారం దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.18 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్ ధర రూ.25 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత ఈ కారు.. రాబోయే మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ , ఎంజీ జెడ్ఎస్ ఈవీ, టయోటా ఎబెల్లా, మారుతి సుజుకి ఈ-విటారా వంటి మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు గట్టి పోటీని ఇవ్వనుంది.

