Tata Sierra EV : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐకానిక్ బ్రాండ్ టాటా సియెర్రా ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలో మెరిసేందుకు సిద్ధమైంది. టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ సియెర్రా లాంచ్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అంటే సరిగ్గా జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఈ కారు భారత రోడ్లపై పరుగులు తీయనుంది. గత కొన్నాళ్లుగా టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారుపై ఇప్పుడు అధికారిక స్పష్టత రావడంతో వాహన ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.

సియెర్రా ఈవీ బ్యాటరీ సామర్థ్యం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇందులో రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి 55 kWh ప్యాక్ కాగా, రెండోది భారీ సామర్థ్యం గల 65 kWh యూనిట్. ఈ పెద్ద బ్యాటరీని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. నగరంలో తిరగడమే కాకుండా, లాంగ్ ట్రిప్స్‌కు వెళ్లేవారికి కూడా ఇది సరైన ఎంపిక. ఇందులో సింగిల్ మోటార్ (RWD), డ్యూయల్ మోటార్ (AWD) వెర్షన్లు అందుబాటులోకి రానున్నాయి.

సియెర్రా ఈవీ ఇంటీరియర్ డిజైన్ చాలా లగ్జరీగా ఉండబోతోంది. ఇందులో ఏకంగా మూడు భారీ స్క్రీన్ల లేఅవుట్ ఉండటం విశేషం. డ్రైవర్ కోసం 12.3 ఇంచుల డిజిటల్ కన్సోల్, మధ్యలో అంతే పరిమాణం గల టచ్‌స్క్రీన్ సిస్టమ్, ముందు కూర్చునే ప్యాసింజర్ కోసం మరో 12.3 ఇంచుల ప్రత్యేక డిస్‌ప్లే ఉండబోతున్నాయి. దీనివల్ల కారు లోపల ఒక అధునాతన టెక్నాలజీ ప్రపంచంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఓటీఏ అప్‌డేట్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ దీనికి అదనపు బలం.

టాటా కారు అంటేనే సేఫ్టీకి మారుపేరు. సియెర్రా ఈవీలో లెవల్-2 ఏడీఏఎస్ సిస్టమ్ ఉంటుంది. ఇది ప్రమాదాలను ముందుగానే గుర్తించి కారును కంట్రోల్ చేస్తుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంతేకాదు, ఈ కారు ద్వారా ఇతర ఎలక్ట్రిక్ వస్తువులను లేదా ఇతర ఈవీ కార్లను కూడా ఛార్జ్ చేసుకునే (V2L, V2V) సదుపాయం ఉండటం గమనార్హం.

టాటా సయేరా ఈవీ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.17.5 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది మార్కెట్లోకి వస్తే హ్యుందాయ్ క్రెటా ఈవీ, మహీంద్రా XEV 9e, మారుతి సుజుకి ఈ-విటారా వంటి దిగ్గజ కార్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. పాత సియెర్రా డిజైన్ లోని కొన్ని అంశాలను కొనసాగిస్తూనే, భవిష్యత్ తరానికి తగ్గట్టుగా ఈ కారును టాటా మోటార్స్ తీర్చిదిద్దింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story