సియెర్రా ఈవీ రాకతో క్రెటా పని ఖాళీ

Tata Sierra EV : టాటా మోటార్స్ తన ఫ్యూచరిస్టిక్ ఎస్‌యూవీ టాటా సియెర్రా ఈవీని ఫిబ్రవరి 2026 చివరి నాటికి మార్కెట్లో విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసింది. గతేడాది నవంబర్‌లో విడుదల చేసిన టీజర్ ఇప్పటికే కస్టమర్లలో భారీ అంచనాలను పెంచింది. సాధారణ పెట్రోల్/డీజిల్ సియెర్రా డెలివరీలు జనవరి మధ్య నుంచే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా తోడవ్వడంతో టాటా ఈవీ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత చాటుకోనుంది.

అందం, ధృడత్వం కలగలిసిన అద్భుతమైన డిజైన్‌తో సియెర్రా ఈవీ వస్తోంది. దీని ముందు భాగంలో మూసివేసిన గ్రిల్, ఎల్‌ఈడీ లైట్ బార్‌తో కూడిన ఫ్లాట్ బంపర్ దీనికి మోడరన్ లుక్ ఇస్తున్నాయి. పాత సియెర్రా తరహాలోనే ర్యాప్‌రౌండ్ రియర్ గ్లాస్(వెనుక అద్దం) డిజైన్ ఈ కారులో కూడా హైలైట్‌గా నిలవనుంది. కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్, కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ ఈ ఎస్‌యూవీకి ప్రీమియం ఫీల్ ఇస్తున్నాయి.

టాటా మోటార్స్ అధికారికంగా వివరాలు వెల్లడించనప్పటికీ, సియెర్రా ఈవీలో రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది.

55 kWh బ్యాటరీ: ఇది కర్వ్ ఈవీ తరహాలో సుమారు 502 కి.మీ రేంజ్ (MIDC) ఇస్తుంది. ఇది 167 PS పవర్, 215 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

65 kWh బ్యాటరీ: హారియర్ ఈవీ తరహాలో పెద్ద బ్యాటరీ ప్యాక్ కూడా ఉండవచ్చు. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 538 కి.మీ రేంజ్ ఇస్తుందని అంచనా. ఇది ఏకంగా 238 PS పవర్, 315 Nm టార్క్‌ను జనరేట్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది.

సొగసైన లుక్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వస్తున్న సియెర్రా ఈవీకి మార్కెట్లో ప్రత్యర్థులు తక్కువేం లేరు. హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, మహీంద్రా బీఈ.6, త్వరలో రాబోతున్న మారుతి సుజుకి ఈ-విటారా వంటి కార్ల నుంచి దీనికి గట్టి పోటీ ఎదురుకానుంది. ధర విషయానికి వస్తే.. బేస్ వేరియంట్ సుమారు రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ విభాగంలో లగ్జరీ, రేంజ్ రెండూ కావాలనుకునే వారికి సియెర్రా ఈవీ ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story