Tata Sierra EV : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన ఐకానిక్ బ్రాండ్ సియెర్రాను సరికొత్త ఎలక్ట్రిక్ రూపంలో తిరిగి తీసుకువస్తోంది. ఒకప్పుడు ఇండియన్ రోడ్లపై ఒక వెలుగు వెలిగిన ఈ ఎస్‌యూవీని, ఇప్పుడు అధునాతన టెక్నాలజీతో టాటా సియెర్రా ఈవీగా లాంచ్ చేసేందుకు కంపెనీ సర్వం సిద్ధం చేసింది. కేవలం డిజైన్ మాత్రమే కాదు, రేంజ్, పర్ఫార్మెన్స్ విషయంలో కూడా ఇది ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించబోతోంది. జూన్ 2026 నాటికి ఈ కారు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

టాటా సియెర్రా ఈవీ ప్రధానంగా దాని రేంజ్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఈ కారులో 55 kWh, 65 kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉన్న మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. దీనికి తోడు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో, సుదూర ప్రయాణాలకు కూడా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది. ఇది సింగిల్ మోటార్, డ్యూయల్ మోటార్ (ఆల్-వీల్ డ్రైవ్) కాన్ఫిగరేషన్లలో రాబోతోంది.

కారు లోపల అడుగుపెడితే ఏదో ఫ్యూచరిస్టిక్ విమానంలో కూర్చున్న అనుభూతి కలుగుతుంది. ఇందులో త్రీ-స్క్రీన్ లేఅవుట్ ఉండబోతోంది. డ్రైవర్ కోసం 12.3 ఇంచ్ డిజిటల్ క్లస్టర్, మధ్యలో 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పక్కన కూర్చునే ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా మరో 12.3 ఇంచ్ స్క్రీన్‌ను అమర్చారు. వీటితో పాటు లెవల్-2 ADAS సేఫ్టీ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ గ్లాస్ రూఫ్, మెమరీ ఫంక్షన్ ఉన్న పవర్ సీట్లు వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి.

పాత సియెర్రాలోని మజిల్ లుక్‌ను కాపాడుకుంటూనే, దీనికి మోడ్రన్ ఈవీ హంగులను జోడించారు. క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, స్ప్లిట్ హెడ్ లైట్ సెటప్, కారు వెడల్పు మొత్తం మెరిసే ఎల్ఈడీ డీఆర్ఎల్స్ (DRLs), ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఈ కారుకు ప్రీమియం లుక్‌ని ఇస్తాయి. ఇది టాటా వారి కొత్త acti.ev+ స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి తయారవుతోంది. దీనివల్ల కారు లోపల స్పేస్ చాలా ఎక్కువగా ఉండటమే కాకుండా భద్రత కూడా పెరుగుతుంది.

టాటా సయెర్రా ఈవీ ప్రారంభ ధర సుమారు రూ.18.5 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ఇది మార్కెట్లోకి వస్తే మహీంద్రా XUV.e8, హ్యుందాయ్ క్రెటా ఈవీ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. సియెర్రాతో పాటు టాటా అవిన్యా అనే మరో ప్రీమియం ఎలక్ట్రిక్ కారును కూడా 2026 చివరి నాటికి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story