ఎస్‌యూవీ లాంచ్ డేట్ ఫిక్స్

Tata Sierra EV : ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకటే పేరు వినిపిస్తోంది.. అదే టాటా సియెర్రా ఈవీ . ఒకప్పుడు ఇండియన్ రోడ్లపై ఓ వెలుగు వెలిగిన సియెర్రా, ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలో మళ్ళీ ప్రాణం పోసుకుంటోంది. ఈ కారు కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు టాటా మోటార్స్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది అంటే 2026 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ భారతీయ షోరూమ్‌లలో సందడి చేయబోతోంది. టాటా తన ఈవీ ప్రయాణంలో భాగంగా వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన మోడల్ ఇదే కావడం విశేషం.

టాటా సియెర్రా ఈవీ లాంచ్ తేదీపై గత కొన్నాళ్లుగా రకరకాల ఊహాగానాలు సాగాయి. అయితే ఇప్పుడు వచ్చిన తాజా క్లారిటీతో ఆ సస్పెన్స్‌కు తెరపడింది. ఈ కారు 2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లాంచ్ కానుంది. అంటే సరిగ్గా ఏప్రిల్-జూన్ 2026 మధ్య కాలం అన్నమాట. ప్రస్తుతం ఈ కారు దాదాపు ప్రొడక్షన్ స్టేజ్‌కు చేరుకుంది. టాటా ఎలక్ట్రిక్ కార్ల లైనప్‌లో నెక్షన్ ఈవీ కంటే పైన, ఒక ప్రీమియం సెగ్మెంట్‌లో ఇది ఉండబోతోంది. విశాలమైన క్యాబిన్, వినూత్నమైన డిజైన్‌తో ఒక లైఫ్ స్టైల్ ఎస్‌యూవీగా ఇది మార్కెట్‌ను ఊపేయడం ఖాయమనిపిస్తోంది.

సాంకేతికపరంగా కూడా టాటా సియెర్రా ఈవీ సరికొత్త రికార్డులు సృష్టించనుంది. ఇప్పటివరకు టాటా ఈవీలు సింగిల్ మోటార్, ఫ్రంట్ వీల్ డ్రైవ్‌తో వస్తుండగా.. సియెర్రాలో మాత్రం డ్యుయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం. దీనివల్ల ఆఫ్-రోడింగ్‌లో కూడా ఈ కారు దూసుకెళ్తుంది. బ్యాటరీ విషయానికొస్తే, ఇందులో 65 kWh, 75 kWh సామర్థ్యం కలిగిన రెండు ఆప్షన్లు ఉండవచ్చని తెలుస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇచ్చే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారు ఖచ్చితంగా వేచి చూడాల్సిన మోడల్ ఇదొక్కటే. విభిన్నమైన లుక్, అత్యాధునిక ఫీచర్లు, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్‌తో వస్తున్న సియెర్రా ఈవీ.. టాటా మోటార్స్ చరిత్రలోనే మరో బిగ్గెస్ట్ హిట్ కావడానికి సిద్ధంగా ఉంది. మార్కెట్లో దీని పోటీ మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఈవీ , హ్యుందాయ్ అయానిక్ వంటి ప్రీమియం కార్లతో ఉండే అవకాశం ఉంది. మరి ఏప్రిల్ రాగానే ఈ సరికొత్త ఎస్యూవీ రోడ్లపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story