Tata Sierra EV : లాంచ్ డేట్ లాక్ అయింది.. జూన్ 30న మార్కెట్లోకి టాటా సియెర్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
జూన్ 30న మార్కెట్లోకి టాటా సియెర్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

Tata Sierra EV : భారతీయ ఆటోమొబైల్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐకానిక్ కారు టాటా సియెర్రా ఈవీ అధికారిక లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని జూన్ 30, 2026న మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. 2020 ఆటో ఎక్స్‌పోలో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించబడిన ఈ కారు.. దాదాపు అదే లుక్, ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. గుజరాత్‌లోని టాటా మోటార్స్ సనంద్ ప్లాంట్‌లో సాధారణ ఐసీఈ వేరియంట్‌తో పాటే ఈ ఎలక్ట్రిక్ సియెర్రా కార్లను కూడా సంస్థ తయారు చేస్తోంది.
టాటా సంస్థకు చెందిన అధునాతన Acti.ev+ ప్లాట్‌ఫామ్‌పై ఈ సరికొత్త సియెర్రా ఈవీ రూపుదిద్దుకుంది. కంపెనీ ప్రొడక్షన్ లైన్ లో ఇది ప్రస్తుతం ఉన్న కర్వ్ ఈవీ, రాబోయే హారియర్ ఈవీ కార్ల మధ్య ప్లేస్ అవ్వనుంది. మార్కెట్లోకి వచ్చాక ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మారుతి ఈ-విటారా, టయోటా ఎబెలా, మహీంద్రా BE 6, ఎంజీ జెడ్ఎస్ ఈవీ వంటి గట్టి పోటీదారులతో తలపడనుంది. ధర విషయానికి వస్తే, దీని సాధారణ ఐసీఈ వేరియంట్ ధర రూ.11.49 లక్షల నుంచి రూ.21.29 లక్షల వరకు ఉండగా.. సియెర్రా ఈవీ బేస్ మోడల్ ధర దాదాపు రూ.18 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే హై-ఎండ్ డ్యూయల్ మోటార్ AWD వేరియంట్ ధర రూ.25 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండొచ్చని అంచనా.
బ్యాటరీ ప్యాక్, అదిరిపోయే రేంజ్
టాటా సియెర్రా ఈవీ కారు రియర్-వీల్ డ్రైవ్ (RWD), ఆల్-వీల్ డ్రైవ్ (AWD) అనే రెండు రకాల కాన్ఫిగరేషన్లలో లభించనున్నట్లు టాటా మోటార్స్ ఇప్పటికే స్పష్టం చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం హారియర్ ఈవీ నుంచి 65kWh, 75kWh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ప్యాక్‌లను తీసుకోనున్నారు. ఇందులో వచ్చే పవర్‌ఫుల్ డ్యూయల్-మోటార్ AWD సెటప్‌ను కేవలం హై-ఎండ్ వేరియంట్లలో మాత్రమే అందించనున్నారు. ఈ పెద్ద బ్యాటరీల సహాయంతో టాటా సియెర్రా ఈవీ ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది.
క్లాసిక్ డిజైన్‌తో కూడిన మోడ్రన్ లుక్
అధికారిక టీజర్ల ద్వారా తెలిసిన వివరాల ప్రకారం, టాటా సియెర్రా ఈవీలో ఎలక్ట్రిక్ కార్లకు ఉండే ప్రత్యేకమైన క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, సరికొత్తగా రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్‌ను అమర్చారు. దీని ఓవరాల్ బాడీ డిజైన్ పాత క్లాసిక్ ఐసీఈ మోడల్‌ను గుర్తుకు తెచ్చేలా ఉన్నప్పటికీ.. మోడ్రన్ టచ్ కోసం కారుపై ప్రత్యేకమైన .ev బ్యాజింగ్, గాలిని తట్టుకునేలా డిజైన్ చేసిన ఎయిరో-ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్ హైలైట్‌గా నిలవనున్నాయి. కారు లోపలి లేఅవుట్ చాలా రిచ్‌గా ఉంటుంది. ఇందులో సరికొత్త ఈవీ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్స్‌తో పాటు కారు నుంచి ఇతర వస్తువులకు పవర్ ఇచ్చుకునేలా V2L, ఒక కారు నుంచి మరో కారును చార్జ్ చేసుకునేలా V2V ఫీచర్లను కూడా జోడించారు.
ఫీచర్ల జాతర.. లగ్జరీ నెక్స్ట్ లెవెల్
టాటా సియెర్రా ఈవీలో కస్టమర్లను ఫిదా చేసేలా ఎన్నో అధునాతన లగ్జరీ ఫీచర్లను నింపేశారు. కారు డ్యాష్ బోర్డ్‌పై ట్రిపుల్ స్క్రీన్ సెటప్, అదిరిపోయే సౌండ్ కోసం 13 స్పీకర్లు గల ప్రీమియం జేబీఎల్ ఆడియో సిస్టమ్, మ్యాప్‌ల్స్ ఆటోతో కూడిన ఇన్-బిల్ట్ నావిగేషన్, గాలి నాణ్యతను తెలిపే AQI ఇండికేటర్ గల ఎయిర్ ప్యూరిఫైయర్‌ను అందించారు. ఇవే కాకుండా మెమరీ ఫంక్షన్‌తో కూడిన 6-వే పవర్డ్ డ్రైవర్ సీట్, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎం (IRVM), వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ చార్జర్ మరియు ప్రయాణికుల భద్రత కోసం అత్యంత సురక్షితమైన లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి హై-టెక్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఈ కారు సరికొత్త సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

