Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ సేఫ్టీలో టాప్.. క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్
క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్

Tata Sierra EV: ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలులో రేంజ్‌తో పాటు భద్రతకు కూడా చాలామంది ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విషయంలో టాటా మోటార్స్‌కు చెందిన సియెర్రా ఈవీ మంచి మార్కులు సాధించింది. భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో ఈ ఎలక్ట్రిక్ SUVకి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. పెద్దల భద్రతలో 32కి 30.62 మార్కులు, పిల్లల భద్రతలో 49కి 45 మార్కులు వచ్చాయి.
పెద్దల భద్రతలో మంచి స్కోర్
సైడ్ ఇంపాక్ట్, సైడ్ పోల్ పరీక్షల్లో టాటా సియెర్రా ఈవీ మెరుగైన పనితీరు కనబరిచింది. ముందు సీట్లలో కూర్చున్నవారికి మంచి రక్షణ లభించినట్లు పరీక్షల్లో వెల్లడైంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), సైడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగులు, సీట్‌బెల్ట్ అలర్ట్ వంటి భద్రతా ఫీచర్లు అన్ని వేరియంట్లలో ఉన్నాయి. పాదచారుల భద్రతకు అవసరమైన ఏర్పాట్లు కూడా కల్పించారు.
పిల్లల భద్రతలోనూ సత్తా
పిల్లల భద్రతకు నిర్వహించిన పరీక్షల్లోనూ ఈ SUV మంచి ఫలితాలు సాధించింది. 18 నెలలు, మూడేళ్ల పిల్లల డమ్మీలతో నిర్వహించిన ముందు, పక్క వైపు ఢీకొనే పరీక్షల్లో పూర్తి మార్కులు వచ్చాయి. చైల్డ్ సీట్ అమరిక పరీక్షలోనూ 12కి 12 మార్కులు సాధించింది. అయితే వాహన పరిశీలనలో కొన్ని మార్కులు తగ్గడంతో మొత్తం స్కోర్ 49కి 45గా నమోదైంది.
బ్యాటరీ, రేంజ్ వివరాలు
టాటా సియెర్రా ఈవీని Acti.ev+ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించారు. ఇందులో 63 kWh, 75 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. 63 kWh మోడల్ 238 hp పవర్ ఇస్తుంది. 75 kWh రియర్ వీల్ డ్రైవ్ మోడల్ 209 hp పవర్‌తో వస్తుంది. 75 kWh బ్యాటరీతో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ వేరియంట్లో రెండు మోటార్లు కలిపి 504 Nm టార్క్ అందిస్తాయి. బూస్ట్ మోడ్‌లో కేవలం 5.8 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు.
ఛార్జింగ్, ధర ఎంతంటే?
కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం 75 kWh రియర్ వీల్ డ్రైవ్ మోడల్ 665 కి.మీ, ఆల్ వీల్ డ్రైవ్ మోడల్ 624 కి.మీ, 63 kWh మోడల్ 535 కి.మీ MIDC రేంజ్ ఇస్తాయి. 120 kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో 15 నిమిషాల ఛార్జింగ్‌కు 263 కి.మీ ప్రయాణించేంత రేంజ్ లభిస్తుంది. 20 నుంచి 80 శాతం ఛార్జింగ్‌కు సుమారు 26 నిమిషాలు పడుతుంది. ఈ SUV ఎక్స్‌షోరూమ్ ధరలు రూ.18.79 లక్షల నుంచి రూ.25.99 లక్షల వరకు ఉన్నాయి.

