Tata Sierra: ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే లుక్‌తో లాంఛ్ అయిన టాటా సియెర్రా కొత్త సిరీస్
టాటా సియెర్రా కొత్త సిరీస్

Tata Sierra: భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా సియెర్రా ఎస్‌యూవీకి సంబంధించి కంపెనీ ఒక సంచలన ప్రకటన చేసింది. ప్రముఖ దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ తన పాపులర్ సియెర్రా మోడల్‌లో సరికొత్త లీజెండ్ సిరీస్‌ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సరికొత్త సిరీస్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర కేవలం రూ.11.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కార్ల ప్రియుల బడ్జెట్, అవసరాలకు తగినట్లుగా సరికొత్త వేరియంట్ల శ్రేణిని, ఆకర్షణీయమైన రంగులను, అత్యాధునిక ప్రీమియం ఫీచర్లను ఈ సిరీస్‌లో చేర్చినట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ కొత్త లీజెండ్ సిరీస్‌లో మొత్తం ఐదు వేరియంట్లను పరిచయం చేశారు. వీటిలో స్మార్ట్+ ఎల్, ప్యూర్ ఎల్, ప్యూర్ ఎల్(ఓ), ప్యూర్+ ఎల్, టాప్-ఎండ్ వెర్షన్‌గా అడ్వెంచర్+ ఎల్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు బేసిక్ మోడల్ నుంచి పై స్థాయి మోడళ్లకు వెళ్లేకొద్దీ క్రమంగా మరిన్ని అధునాతన కంఫర్ట్ ఫీచర్లు లభిస్తాయి. అంతేకాకుండా వాహన ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రిస్టిన్ వైట్, ప్యూర్ గ్రే, కూర్గ్ క్లౌడ్స్, మున్నార్ మిస్ట్, బెంగాల్ రూజ్, అండమాన్ అడ్వెంచర్ వంటి సరికొత్త డ్యూయల్-టోన్, సింగిల్-టోన్ కలర్ ఆప్షన్లలో ఈ ఎస్‌యూవీ లభించనుంది.
కేబిన్ విషయానికి వస్తే.. ప్రారంభ వేరియంట్ స్మార్ట్+ ఎల్ నుంచే లెదరెట్ సీట్లు, లెదరెట్ డోర్ ట్రిమ్స్, ఆర్మ్రెస్ట్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఆటో-ఫోల్డింగ్ ఓఆర్‌వీఎంలు, రూఫ్ రెయిల్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ఇక సేఫ్టీ విషయానికి వస్తే, అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఆటో హోల్డ్ ఫీచర్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి స్టాండర్డ్‌గా అందించడం విశేషం. మిగతా వేరియంట్లలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, పవర్ డ్రైవర్ సీట్ వంటి ఎన్నో లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.
టాప్-ఎండ్ మోడలైన 'అడ్వెంచర్+ ఎల్' లో 360-డిగ్రీ హెచ్‌డీ సరౌండ్-వ్యూ సిస్టమ్, బ్లైండ్-స్పాట్ వ్యూ, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్ మరియు రోడ్డు పరిస్థితులకు తగినట్లుగా డ్యాంపింగ్ మార్చే సూపర్‌గ్లైడ్ సస్పెన్షన్ అందించారు. అయితే ఇంజిన్, గేర్ బాక్స్ ఆప్షన్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో పాటు 6-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్, 7-స్పీడ్ డీసీఏ గేర్‌బాక్స్ ఆప్షన్లు యథావిధిగా కొనసాగుతాయి. ధర పరంగానూ, ఫీచర్ల పరంగానూ ఈ సరికొత్త సియెర్రా లీజెండ్ సిరీస్ మార్కెట్లో సంచలనం సృష్టించడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

