Tata Sierra: రూ.11.99 లక్షలకే కొత్త టాటా సియెర్రా లెజెండ్ లాంచ్.. ఫీచర్లు చూస్తే ఫిదా కావాల్సిందే
ఫీచర్లు చూస్తే ఫిదా కావాల్సిందే

Tata Sierra: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీలలో ఒకటైన టాటా సియెర్రా ఇప్పుడు సరికొత్త రూపంలో వినియోగదారుల ముందుకు వచ్చింది. టాటా మోటార్స్ సంస్థ తన పాపులర్ ఎస్‌యూవీ సియెర్రాలో నూతన లెజెండ్ సిరీస్ వెర్షన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సరికొత్త సిరీస్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.11.99ల నుంచి ప్రారంభమై, టాప్ మోడల్ కోసం రూ.19.49ల వరకు ఉంటుంది. పెట్రోల్ అలాగే డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లలో లభించే ఈ కొత్త సిరీస్‌లో స్మార్ట్+ ఎల్, ప్యూర్ ఎల్, ప్యూర్ ఎల్ (ఓ), ప్యూర్+ ఎల్, అడ్వంచర్+ ఎల్ వంటి విభిన్న వేరియంట్లను ప్రవేశపెట్టారు. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కస్టమర్లకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో ఈ మోడళ్లను మార్కెట్లోకి తెచ్చారు.
ఈ లెజెండ్ సిరీస్‌లో ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ పరంగా అనేక ప్రీమియం ఫీచర్లు అమర్చారు. ఉదాహరణకు ప్యూర్ ఎల్ వేరియంట్‌లో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, లెదరేట్ ఇంటీరియర్స్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అలాగే 8 స్పీకర్ల ఆడియో సిస్టమ్ ఇచ్చారు. ఇక ప్యూర్ ఎల్ (ఓ) వేరియంట్‌లో వాయిస్-అసిస్టెడ్ పనోరమిక్ సన్ రూఫ్ సౌకర్యం లభిస్తుంది. అంతేకాకుండా ప్యూర్+ ఎల్ వేరియంట్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6000 పవర్డ్ డ్రైవర్ సీట్, థై సపోర్ట్ ఎక్స్‌టెండర్, బాస్ మోడ్ వంటి లగ్జరీ సదుపాయాలు కల్పించారు. టాప్ మోడల్స్‌లో హైపేరియన్ టర్బో-పెట్రోల్ ఆటోమేటిక్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
ఈ కార్ల పనితీరు పరంగా ఎలాంటి రాజీ పడకుండా పాత సియెర్రాలోని నమ్మకమైన ఇంజిన్లనే ఇందులోనూ కొనసాగించారు. ఇందులో ఒకటిన్నర లీటర్ రెవోట్రాన్ పెట్రోల్, 1.5 లీటర్ హైపేరియన్ టర్బో పెట్రోల్, ఒకటిన్నర లీటర్ క్రయోజనిక్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు లభిస్తున్నాయి. భద్రతా పరంగా చూస్తే టాటా కంపెనీ అత్యంత ప్రాధాన్యతనిచ్చి మొదటి వేరియంట్ నుంచి అన్ని మోడళ్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అలాగే నాల్గు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లను స్టాండర్డ్‌గా అందించింది. దీనివల్ల ప్రయాణికుల భద్రత మరింత పటిష్టంగా మారుతుంది.
టాటా మోటార్స్ తన నెక్సాన్ తరహాలోనే సియెర్రా లైనప్‌ను కూడా మరింత విస్తృతంగా మార్చాలని ప్రణాళికలు రచిస్తోంది. కొత్త వేరియంట్లు అందుబాటులోకి రావడం వల్ల వివిధ మోడళ్ల మధ్య ధరల వ్యత్యాసం చాలావరకు తగ్గిపోయింది. కస్టమర్లు కేవలం కొద్దిగా అదనపు మొత్తం చెల్లించి తమకు నచ్చిన మెరుగైన వేరియంట్‌ను ఎంచుకునే అవకాశం లభిస్తోంది. ఈ లెజెండ్ సిరీస్ కింద కొత్తగా 18 వేరియంట్లు చేరడంతో ఇప్పుడు మొత్తం సియెర్రా శ్రేణి 42 రకాల ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ కాంబినేషన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

