Tata Sierra : పెట్రోల్ vs డీజిల్.. టాటా సియెర్రాలో ఏ వేరియంట్ కొంటే బెటర్ ?
టాటా సియెర్రాలో ఏ వేరియంట్ కొంటే బెటర్ ?

Tata Sierra : టాటా మోటార్స్ తన ఐకానిక్ బ్రాండ్ టాటా సియెర్రాని సరికొత్త అవతారంలో మార్కెట్లోకి వదిలింది. రెట్రో లుక్, మోడ్రన్ టెక్నాలజీతో వస్తున్న ఈ ఎస్‌యూవీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే కొత్త సియెర్రా కొనే ప్లాన్ లో ఉన్నవారిని వేధిస్తున్న ప్రధాన ప్రశ్న.. పెట్రోల్ మోడల్ తీసుకోవాలా? లేక డీజిల్ మోడల్ తీసుకోవాలా? అని. ఈ రెండింటి మధ్య ఉన్న మైలేజ్ తేడాలు, మెయింటెనెన్స్ ఖర్చులు, మీ అవసరానికి ఏది సెట్ అవుతుందో తెలుసుకుందాం.
పెట్రోల్ వేరియంట్
టాటా సియెర్రాలో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఉంది. ఇది దాదాపు 160 హార్స్‌పావర్ శక్తిని అందిస్తుంది. పెట్రోల్ మోడల్ లీటరుకు దాదాపు 15 నుంచి 17 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అయితే సిటీ ట్రాఫిక్ లో ఇది 12 కిమీ వరకు పడిపోయే ఛాన్స్ ఉంది. పెట్రోల్ ఇంజన్ చాలా స్మూత్ గా ఉంటుంది. శబ్దం తక్కువగా వస్తుంది. మీ వినియోగం నెలకు 1000 కిలోమీటర్ల కంటే తక్కువ ఉంటే, మీరు ఎక్కువగా సిటీలోనే తిరిగే పక్షంలో పెట్రోల్ వేరియంట్ మీకు బెస్ట్ ఛాయిస్. దీని మెయింటెనెన్స్ ఖర్చు కూడా డీజిల్ తో పోలిస్తే కాస్త తక్కువ.
డీజిల్ వేరియంట్
ఎక్కువ దూరం ప్రయాణించే వారికి, హైవేలపై వేగంగా దూసుకెళ్లాలనుకునే వారికి డీజిల్ వేరియంట్ ఒక వరం. డీజిల్ మోడల్ లీటరుకు 19 నుండి 21 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. హైవేలపై ఇది ఇంకా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. డీజిల్ ఇంజన్ లో టార్క్ ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల కొండ ప్రాంతాల్లో లేదా భారీ లోడ్ తో వెళ్తున్నప్పుడు కారు అలసిపోదు. మీ రన్నింగ్ నెలకు 1500 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే, డీజిల్ వేరియంట్ మీకు ఏటా వేల రూపాయల ఇంధన ఖర్చును ఆదా చేస్తుంది.
డిజైన్, సేఫ్టీ
టాటా సియెర్రా కేవలం ఇంజన్ తోనే కాదు, తన లుక్ తో కూడా కస్టమర్లను కట్టిపడేస్తోంది. పాత సియెర్రా గుర్తుకు వచ్చేలా పెద్ద గ్లాస్ రూఫ్, మోడ్రన్ ఎల్‌ఈడీ లైట్లు, గంభీరమైన బాడీ డిజైన్ దీని సొంతం. లోపల 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 ADAS సేఫ్టీ ఫీచర్లు వంటివి ఉన్నాయి. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో టాటా దీనిని ఒక సురక్షితమైన ఫ్యామిలీ కార్ గా తీర్చిదిద్దింది.
ధర, వేరియంట్లు
టాటా సియెర్రా ప్రారంభ ధర సుమారు రూ.11.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలై టాప్ మోడల్ రూ.21 లక్షల వరకు ఉంది. ఇందులో స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్, అకంప్లిష్డ్ అనే వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు బడ్జెట్ లో మంచి కారు కావాలనుకుంటే ప్యూర్ వేరియంట్, లేదు ఫుల్ లగ్జరీ కావాలనుకుంటే అకంప్లిష్డ్ వేరియంట్ ను ఎంచుకోవచ్చు.

