Tata Sierra : టాటా సియెర్రా సంచలనం.. తొలి రోజునే 70,000 బుకింగ్స్
తొలి రోజునే 70,000 బుకింగ్స్

Tata Sierra : టాటా మోటార్స్ నుంచి రాబోతున్న కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ టాటా సియెర్రా బుకింగ్స్ ప్రారంభమైన మొదటి రోజునే అసాధారణమైన రికార్డును నెలకొల్పింది. డిసెంబర్ 16న బుకింగ్‌లు ప్రారంభం కాగానే కంపెనీకి 70,000 కంటే ఎక్కువ కన్ఫర్మ్డ్ బుకింగ్‌లు వచ్చాయి. దాదాపు 1.35 లక్షల మంది వినియోగదారులు తమకు నచ్చిన విధంగా కార్ కాన్ఫిగరేషన్‌లను కూడా సమర్పించారు. ఈ స్థాయిలో స్పందన లభించడం మార్కెట్లో సియెర్రాపై ఉన్న భారీ అంచనాలను తెలియజేస్తోంది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.49 లక్షలు కాగా, టాప్ మోడల్ ధర రూ.21.29 లక్షల వరకు ఉంది. సియెర్రా Smart+ నుంచి Accomplished+ వరకు మొత్తం ఏడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
టాటా సియెర్రా మూడు పవర్ఫుల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది: అవి 1.5-లీటర్ హైపీరియన్ T-GDi పెట్రోల్, 1.5-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్, 1.5-లీటర్ క్రయోజెట్ డీజిల్. అన్ని ఇంజన్లలో ఆటోమేటిక్, మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ ప్రత్యేకించి రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా మెరుగైన పనితీరును అందించడానికి సిటీ, స్పోర్ట్ అనే రెండు డ్రైవ్ మోడ్‌లు, అలాగే నార్మల్, వెట్, రఫ్ మూడు టెర్రైన్ మోడ్‌లను కలిగి ఉంది. కంపెనీ టెస్టింగ్ సమయంలో లీటరుకు 29.9కిమీ మైలేజ్, గంటకు 222 కిమీ టాప్ స్పీడ్‌ను నమోదు చేసినప్పటికీ, కస్టమర్ కార్లలో సేఫ్టీ కోసం టాప్ స్పీడ్‌ను గంటకు 190కిమీకు పరిమితం చేశారు.

