Tata Sierra vs Kia Seltos: మైలేజ్, పవర్, ధరల్లో ఏది బెస్ట్ ఆప్షన్?
ఏది బెస్ట్ ఆప్షన్?

Tata Sierra vs Kia Seltos: మిడ్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలో టాటా సియెర్రా, కియా సెల్టోస్ మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటు రకరకాల గేర్‌బాక్స్ ఫీచర్లతో వస్తున్న ఈ రెండు కార్లలో ఏది కొంటే లాభం అనే సందేహం కార్ లవర్లలో వ్యక్తమవుతోంది.
మైలేజ్ రేసులో ఎవరి హవా ఎంత?
మైలేజ్ లెక్కల విషయానికి వస్తే టాటా సియెర్రా, కియా సెల్టోస్ రెండూ వేర్వేరు విభాగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నాయి. టాటా సియెర్రా పెట్రోల్ వేరియంట్ లీటరుకు 15.3 నుంచి 17.4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, డీజిల్ వేరియంట్ ఏకంగా 19.2 నుంచి 21.3 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. కియా సెల్టోస్ పెట్రోల్ వర్షన్ లీటరుకు 17.7 నుంచి 17.9 కిలోమీటర్లు, డీజిల్ వర్షన్ 20.7 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీలు చెబుతున్నాయి. పెట్రోల్ మోడల్స్‌లో కియా సెల్టోస్ మెరుగైన ఫలితాలు చూపిస్తుంటే, డీజిల్ ఇంజన్ల విభాగంలో టాటా సియెర్రా పైచేయి సాధిస్తోంది. మ్యాన్యువల్, డీసీటీ వేరియంట్లలో కూడా సియెర్రా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్‌లో మాత్రం సెల్టోస్ లీటరుకు 2.2 కిలోమీటర్లు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.
ఇంజన్ పవర్ విషయంలో కియా దూకుడు
ఇంజన్ శక్తి సామర్థ్యాల విషయానికి వస్తే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ విభాగంలో కియా సెల్టోస్ ముందంజలో నిలుస్తోంది. టాటా సియెర్రాలోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 106 హెచ్‌పీ పవర్ ఇస్తుంటే, సెల్టోస్‌లోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 115 హెచ్‌పీ పవర్ తో పాటు 144 ఎన్ఎమ్ టాార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ పవర్ కోరుకునే వారికి సెల్టోస్ బెస్ట్ ఛాయిస్‌గా మారుతోంది. ఇక టర్బో పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే రెండు ఎస్‌యూవీలు దాదాపు 160 హెచ్‌పీ వరకు పవర్ అందిస్తున్నాయి. టార్క్ విషయంలోనూ సెల్టోస్ 253 ఎన్ఎమ్‌తో స్వల్ప ఆధిక్యంలో ఉండి, రోడ్డుపై వేగవంతమైన డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది.
ట్రాన్స్‌మిషన్ ఛాయిస్.. ఎవరికి ఏది ప్లస్?
గేర్‌బాక్స్ రకాల విషయంలో రెండు కార్ల తయారీ సంస్థలు కస్టమర్ల ఇష్టాఇష్టాలకు పెద్దపీట వేశాయి. మ్యాన్యువల్, సీవీటీ, డీసీటీ, ఐఎమ్‌టీ సహా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. నగరాల్లో సులువైన డ్రైవింగ్ కోరుకునే వారైనా, హైవేలపై వేగంగా దూసుకెళ్లాలనుకునే వారైనా తమకు నచ్చిన ట్రాన్స్‌మిషన్ వెర్షన్‌ను ఎంచుకునే వెసులుబాటును ఈ రెండు మోడళ్లు కల్పిస్తున్నాయి. భిన్నమైన రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా స్పందించే అధునాతన గేర్‌బాక్స్ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి.
ధరల వ్యత్యాసం ఎంత ఉందంటే?
కారు కొనుగోలు నిర్ణయంలో ధర కీలక పాత్ర పోషిస్తుంది. టాటా సియెర్రా ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ ధర రూ.24.81 లక్షల వరకు ఉంది. కియా సెల్టోస్ ఆరంభ ధర రూ.10.99 లక్షల నుంచి మొదలై టాప్ మోడల్ ధర రూ.24.70 లక్షల వరకు విస్తరించింది. సెల్టోస్ బేస్ వేరియంట్, టాటా సియెర్రా కంటే రూ.50,000 తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఎక్కువ పవర్, మెరుగైన టర్బో ఆటోమేటిక్ మైలేజ్ కావాలనుకునే వారికి సెల్టోస్ అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ డీజిల్ మైలేజ్, స్ట్రాంగ్ బాడీ కోరుకునే వారికి టాటా సియెర్రా సరైన ఎంపికగా నిలుస్తుంది.

