Tata Sierra : మార్కెట్‌లో కొత్త పోటీ.. టాటా సియెర్రా ఒక వైపు.. హ్యుందాయ్, కియా మరో వైపు
టాటా సియెర్రా ఒక వైపు.. హ్యుందాయ్, కియా మరో వైపు

Tata Sierra : టాటా మోటార్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్‌యూవీలలో ఒకటైన టాటా సియెర్రా 2025లో భారత మార్కెట్‌లో అడుగుపెట్టింది. ఈ కారు రాకతో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి టాప్ సెల్లింగ్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఏర్పడింది. కొత్త సియెర్రా రెట్రో డిజైన్‌లో ఆధునిక ఫీచర్లను అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. సియెర్రా ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.49 లక్షలు కాగా, క్రెటా ధర రూ.10.73 లక్షల నుంచి రూ.20.20 లక్షల వరకు, సెల్టోస్ ధర రూ.10.79 లక్షల నుంచి రూ.19.81 లక్షల వరకు ఉన్నాయి.
టాటా సియెర్రా కొలతల పరంగా తన ప్రత్యర్థులతో పోలిస్తే అనేక అంశాలలో ముందంజలో ఉంది. టాటా సియెర్రా (4,340 mm) హ్యుందాయ్ క్రెటా కంటే కొంచెం పొడవుగా ఉంది అయితే కియా సెల్టోస్ (4,365 mm) ఈ మూడింటిలో అత్యంత పొడవైన కారు. టాటా సియెర్రా ఈ సెగ్మెంట్‌లోని అన్ని కార్ల కంటే ఎక్కువ వెడల్పుగా, ఎత్తుగా ఉంటుంది. ఎక్కువ వెడల్పు కారణంగా క్యాబిన్‌లో విశాలమైన స్థలం లభిస్తుంది. సియెర్రాలో 2,730 mm పొడవైన వీల్‌బేస్ లభిస్తుంది, ఇది క్రెటా (2,610 mm), సెల్టోస్ (2,610 mm) కంటే చాలా ఎక్కువ. దీనివల్ల లోపల లెగ్ స్పేస్ కూడా మెరుగ్గా ఉంటుంది.
ఈ సెగ్మెంట్ ఎస్‌యూవీలలో సాధారణంగా 400 నుంచి 500 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. కానీ టాటా సియెర్రా ఏకంగా 622 లీటర్ల బూట్ స్పేస్ తో వచ్చింది. ఈ భారీ బూట్ స్పేస్ కారణంగా, ఈ సెగ్మెంట్‌లో అత్యధిక స్పేస్ ఉన్న కారుగా సియెర్రా అగ్రస్థానంలో నిలుస్తుంది. మొత్తంగా, లోపల ఎక్కువ స్థలం, భారీ బూట్ స్పేస్ కోరుకునే వినియోగదారులకు టాటా సియెర్రా బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. అయితే, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ ఇప్పటికే మార్కెట్‌లో తమ విశ్వసనీయతను నిరూపించుకున్నాయి.

