పాత మోడల్ ఎందుకు ఫెయిల్ అయ్యిందో తెలుసా?

Tata Sierra : టాటా మోటార్స్ కొత్త లుక్, ఆధునిక ఫీచర్లతో సియెరా ఎస్‌యూవీని తిరిగి మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉన్న పాత సియెరాను కంపెనీ ఎందుకు నిలిపివేసిందో చాలా మందికి తెలియదు. ఈ కారును తొలిసారిగా 1991లో భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. ఇది అప్పట్లో మన దేశంలో మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీగా గుర్తింపు పొందింది. మొదట సాధారణ డీజిల్ ఇంజన్‌తో వచ్చిన ఈ కారు, ఆ తర్వాత టర్బో ఇంజన్‌తో కూడా విడుదలైంది.

పాత టాటా సియెరా 1991 నుంచి 2003 వరకు భారతీయ రోడ్లపై ప్రయాణించినా, 2003లో కంపెనీ దీని ఉత్పత్తిని నిలిపివేసింది. ఈ కారు అమ్మకాలు తగ్గి, మార్కెట్‌లో ఫెయిల్ అవ్వడానికి ముఖ్యంగా మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి:

త్రీ డోర్ డిజైన్ : ఆ రోజుల్లో భారతీయ కస్టమర్లు కుటుంబం కోసం ఎక్కువ స్థలం, సౌకర్యం ఉన్న కార్లను ఇష్టపడేవారు. కానీ, పాత సియెరాకు కేవలం మూడు డోర్లు (డ్రైవర్ వైపు ఒకటి, ప్యాసింజర్ వైపు ఒకటి, వెనుక బూట్ డోర్) మాత్రమే ఉండేవి. వెనుక సీట్లలో కూర్చోవడానికి లేదా సామాను పెట్టడానికి ఇది చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ డిజైన్ కారణంగానే చాలా మంది వినియోగదారులు సియెరాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు.

అధిక ధర : సియెరా లాంచ్ అయినప్పుడు, దాని ధర అప్పటి మార్కెట్ పరిస్థితులకు చాలా ఎక్కువగా ఉండేది. భారతీయ మార్కెట్ ఎప్పుడూ బడ్జెట్-ఫ్రెండ్లీ కార్ల వైపే మొగ్గు చూపింది. కానీ, సియెరా ధర ఎక్కువ ఉండటం వలన ఇది సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. కారు నిలిపివేసే సమయానికి కూడా దీని ధర దాదాపు రూ.25 లక్షల వరకు ఉండేదని కొన్ని వెబ్‌సైట్లు చెబుతున్నాయి. ఎక్కువ ధర కారణంగా దీని అమ్మకాలు పరిమితంగానే ఉన్నాయి.

తక్కువ అమ్మకాలు, పోటీ : పైన చెప్పిన మూడు డోర్ల డిజైన్, అధిక ధర కారణంగా సియెరా అమ్మకాలు అనుకున్నంత స్థాయిలో జరగలేదు. దీంతో కంపెనీకి నిరాశే మిగిలింది. అంతేకాకుండా కాలంతో పాటు ఇతర కంపెనీల నుంచి వచ్చిన కొత్త కార్ల ఇంజన్లు, ఫీచర్ల ముందు సియెరా మెల్లగా వెనుకబడిపోయింది.

కొత్త సియెరాపై ఆశలు

పాత సియెరా అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, టాటా మోటార్స్ ఈసారి కొత్త సియెరాను ఐదు డోర్ల డిజైన్‌తో పాటు, మోడ్రన్ ఫీచర్లు, పవర్ఫుల్ ఇంజన్ ఆప్షన్లు, మంచి ధరతో తీసుకువచ్చే అవకాశం ఉంది. మార్కెట్‌లో టాటా హారియర్, సఫారీ మోడల్స్‌కు మంచి స్పందన లభించిన నేపథ్యంలో కొత్త సియెరా కూడా భారీ విజయాన్ని సాధిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story