Tata Tiago EV : టియాగో ఈవీ కొత్త అవతారం.. అదిరిపోయే రేంజ్, అద్భుతమైన ఫీచర్లతో టాటా మాస్టర్ ప్లాన్
అదిరిపోయే రేంజ్, అద్భుతమైన ఫీచర్లతో టాటా మాస్టర్ ప్లాన్

Tata Tiago EV : భారతదేశ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో సంచలనం సృష్టించిన టాటా మోటార్స్, ఇప్పుడు తన మోస్ట్ పాపులర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగో ఈవీని సరికొత్త అవతారంలో తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ కారుకి సంబంధించిన అప్‌డేటెడ్ మోడల్ రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటూ కెమెరాలకు చిక్కింది. గతేడాది చిన్నపాటి మార్పులు చేసినప్పటికీ, ఈసారి రాబోయే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మాత్రం ఊహించని మార్పులతో ఉండబోతోంది. సమాచారం ప్రకారం.. ఈ కొత్త టియాగో ఈవీ 2026 ద్వితీయార్థంలో భారత రోడ్లపైకి రానుంది. ఈ అప్‌డేట్‌లో ప్రధానంగా కారు రూపురేఖలను మార్చడమే కాకుండా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇంకా ఎక్కువ దూరం ప్రయాణించేలా బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచడంపై టాటా దృష్టి పెట్టింది.
డిజైన్ పరంగా కొత్త టియాగో ఈవీ మరింత షార్ప్‌గా, ఫ్యూచరిస్టిక్ లుక్‌లో కనిపించనుంది. స్పై చిత్రాల ప్రకారం.. కారు ముందు భాగంలో హెడ్‌లైట్లను చాలా స్లిమ్‌గా డిజైన్ చేశారు. ముఖ్యంగా ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్ ఇప్పుడు బంపర్ మీద కాకుండా నేరుగా హెడ్‌లైట్ క్లస్టర్‌లోనే కనుబొమ్మల ఆకారంలో ఉండి కారుకి ఒక అగ్రెసివ్ లుక్‌ను ఇస్తున్నాయి. వీటితో పాటు బంపర్, గ్రిల్ డిజైన్‌ను కూడా పూర్తిగా మార్చేశారు. ఇక కారు పక్క భాగం మరియు వెనుక భాగంలో కూడా టాటా తన మార్క్ చూపిస్తోంది. రేంజ్ పెంచడానికి సహకరించే ప్రత్యేకమైన ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్‌ను ఇందులో అమర్చారు. కారు వెనుక వైపు ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ రాబోతున్నాయి. దీనివల్ల రాత్రి పూట కారు చాలా ప్రీమియంగా కనిపిస్తుంది.
టెక్నాలజీ విషయానికి వస్తే.. టాటా మోటార్స్ తన కొత్త 6-ఇన్-1 ఎలక్ట్రిక్ డ్రైవ్ ఆర్కిటెక్చర్‌ను ఈ కారులో ఉపయోగించబోతోంది. ఈ టెక్నాలజీ వల్ల కారు బరువు తగ్గడమే కాకుండా పర్ఫార్మెన్స్ కూడా మెరుగుపడుతుంది. ప్రస్తుతం టియాగో ఈవీలో 19.2kWh, 24kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. అయితే కొత్త మోడల్‌లో హై-డెన్సిటీ బ్యాటరీలను వాడటం ద్వారా రేంజ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. లోపలి భాగంలో కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అప్‌డేటెడ్ డ్యాష్‌బోర్డ్, మరిన్ని సేఫ్టీ ఫీచర్లు ఉండబోతున్నాయి. ఎంజీ కామెట్ ఈవీ, సిట్రోయెన్ ఈ-సీ3 వంటి కార్లకు ఈ కొత్త టియాగో ఈవీ గట్టి పోటీ ఇవ్వనుంది.

