Tata EV : టాటా ఈవీ యజమానులకు గుడ్ న్యూస్..ఇక మీ ఇంటికే వచ్చి కారు ఛార్జింగ్ చేస్తారు
ఇక మీ ఇంటికే వచ్చి కారు ఛార్జింగ్ చేస్తారు

Tata EV : టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల కోసం ఒక అదిరిపోయే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా ఈవీ కార్లు ఉన్నవారికి ఛార్జింగ్ స్టేషన్ల వద్దకు వెళ్లడం లేదా ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడం ఒక్కోసారి ఇబ్బందిగా మారుతుంటుంది. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లలో ఉండేవారికి పార్కింగ్ సమస్యల వల్ల సొంతంగా ఛార్జర్ ఏర్పాటు చేసుకోవడం కష్టం. ఇలాంటి ఇబ్బందులను గమనించిన టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ విభాగం (Tata.ev), ప్రముఖ మొబైల్ ఛార్జింగ్ సంస్థ హాప్చార్జ్తో జతకట్టింది. ఈ ఒప్పందం ద్వారా మీ కారు ఉన్న చోటికే ఛార్జింగ్ వ్యాన్ వచ్చి, బ్యాటరీ ఫుల్ చేసి వెళ్తుంది.
ప్రస్తుతానికి ఈ సేవలను నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ప్రారంభించారు. ఈ కొత్త విధానం ప్రకారం.. ఈవీ యజమానులు ఒక ప్రత్యేక ప్లాట్‌ఫారమ్ ద్వారా తమకు కావాల్సిన సమయంలో ఛార్జింగ్ సెషన్‌ను షెడ్యూల్ చేసుకోవచ్చు. మీరు టైమ్ ఫిక్స్ చేయగానే, ఒక మొబైల్ ఛార్జింగ్ వ్యాన్ మీ ఇంటి వద్దకో లేదా మీరు కారు పార్క్ చేసిన చోటికో నేరుగా వస్తుంది. అక్కడికక్కడే మీ వాహనాన్ని ఛార్జ్ చేస్తుంది. దీనివల్ల కస్టమర్లకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, ఛార్జింగ్ స్టేషన్ల కోసం రోడ్లపై తిరగాల్సిన అవసరం ఉండదు.
ఈ వినూత్న ప్రయత్నంపై టాటా మోటార్స్ తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో ఆసక్తికర విషయాలను పంచుకుంది. సొంత పార్కింగ్ లేదా హోమ్ ఛార్జర్ లేని వారికి ఇది ఒక వరమని పేర్కొంది. అంతేకాదు ఈ కొత్త సేవలను ప్రమోట్ చేయడానికి టాటా ఒక బంపర్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. కొత్తగా టాటా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి పరిమిత కాలం పాటు ఉచిత డోర్‌స్టెప్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. అయితే ఈ ఆఫర్ కొన్ని నిబంధనలకు లోబడి ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాల కోసం కస్టమర్లు తమకు దగ్గరలోని టాటా ఈవీ డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.
భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రధాన అడ్డంకి సరైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడమే. ఈ సమస్యకు మొబైల్ ఛార్జింగ్ వ్యాన్‌లు ఒక అద్భుతమైన పరిష్కారంగా మారుతున్నాయి. హాప్‌చార్జ్ సంస్థ ఈ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తూ, ఆన్ డిమాండ్ సేవలను పర్యవేక్షిస్తుంది. టాటా మోటార్స్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఈవీ కార్లను కొనేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఢిల్లీ ఎన్‌సీఆర్ తర్వాత ఈ సేవలను హైదరాబాద్, బెంగళూరు వంటి ఇతర మెట్రో నగరాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని సమాచారం.

