2027లో టాటా నుంచి లగ్జరీ సునామీ

Tata Avinya : భారతదేశపు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైంది. తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అవిన్యాను ఒక స్పెషల్ లగ్జరీ బ్రాండ్‌గా 2027లో మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీనికి నాయకత్వం వహించే అవిన్యా ఎక్స్ మోడల్‌ను ఇప్పటికే 2025 భారత్ మోబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించింది. టయోటాకు లెక్సస్, హ్యుందాయ్‌కు జెనెసిస్ ఎలాగో.. టాటాకు అవిన్యా అలా ఒక ప్రీమియం గుర్తింపును తీసుకురాబోతోంది.

టాటా మోటార్స్ ఈ బ్రాండ్ కోసం సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. అవిన్యా కార్లను సాధారణ టాటా షోరూమ్‌లలో కాకుండా, కేవలం హై-ఎండ్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే లగ్జరీ అవుట్‌లెట్‌లలోనే విక్రయిస్తారు. వీటిని తొలుత టైర్-1 నగరాల్లో ప్రారంభించి, ఆ తర్వాత టైర్-2 నగరాలకు విస్తరించనున్నారు. ఆన్‌లైన్, ఫిజికల్ ఎక్స్‌పీరియన్స్‌ను కలిపి ఒక ఫిజిటల్ మోడల్ ద్వారా కస్టమర్లకు అత్యున్నత స్థాయి కొనుగోలు అనుభూతిని అందించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ కార్లపై టాటా బ్రాండింగ్ చాలా తక్కువగా ఉంటుంది, తద్వారా దీనికి ఒక గ్లోబల్ లగ్జరీ ఇమేజ్‌ను కల్పించనున్నారు.

అవిన్యా బ్రాండ్ తొలుత పూర్తి ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుగానే తన ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. భవిష్యత్తులో ఐసీఈ (ICE) మోడల్స్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రారంభంలో మాత్రం ఈవీలకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ బ్రాండ్ కింద వచ్చే కార్ల ధరలు హారియర్ ఈవీ కంటే ఎక్కువగా ఉండబోతున్నాయి. అంటే ఇది నేరుగా బివైడి, వోక్స్‌వ్యాగన్, స్కోడా, టయోటా వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లతో తలపడటమే కాకుండా.. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి లగ్జరీ కార్ల రేంజ్‌లో పోటీనివ్వనుంది.

అవిన్యా ఎలక్ట్రిక్ కార్లలో ఉండే ఫీచర్లు వింటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇందులో వెనుక నుండి ముందుకు తెరుచుకునే బటర్ ఫ్లై డోర్స్, 360 డిగ్రీలు తిరిగే రివాల్వింగ్ సీట్లు, విశాలమైన పనోరమిక్ సన్‌రూఫ్, అరోమా డిఫ్యూజర్ వంటి విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి. ముందు భాగంలో విలక్షణమైన T ఆకారపు ఎల్‌ఈడీ లైట్లు, వెనుక వైపు స్లీక్ ఎల్‌ఈడీ స్పాయిలర్ దీనికి ఫ్యూచరిస్టిక్ లుక్ ఇస్తాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల పైగా ప్రయాణించే సామర్థ్యం, డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ వంటివి ఈ కారును టెక్నాలజీ పరంగా టాప్‌లో నిలబెడతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story