Tesla: ప్రపంచ కార్ల మార్కెట్లో సరికొత్త విప్లవానికి టెస్లా నాంది పలకబోతోంది. ఎలోన్ మస్క్‌కి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సైబర్ క్యాబ్‌ను ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసింది. టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరంలో సెప్టెంబర్ 3న నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో దీనిని ఆవిష్కరించనున్నారు. ఈ ఈవెంట్‌కు ఆగస్టు 17 నుంచి 23 మధ్య టెస్లా రోబోటాక్సీ సేవలను అనుభవించిన కొద్దిమంది ఎంపిక చేసిన కస్టమర్లను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ కారులో డ్రైవర్ సీటు, స్టీరింగ్ వీల్, బ్రేక్ లేదా యాక్సిలరేటర్ పెడల్స్ వంటి పరికరాలు ఏవీ ఉండవు. కారు ప్రయాణాన్ని నియంత్రించే అధికారం ప్రయాణికులకు కూడా ఉండదు. కారు తనంతట తానుగా గమ్యస్థానానికి చేరుకుంటుంది.

రెండే సీట్లు.. కృత్రిమ మేధస్సుతో ప్రయాణం

టెస్లా డిజైన్ చేసిన ఈ సైబర్ క్యాబ్‌లో కేవలం ఇద్దరు ప్రయాణించడానికి మాత్రమే సీటింగ్ వెసులుబాటు కల్పించారు. పూర్తి ప్రయాణ బాధ్యత అంతా టెస్లా అభివృద్ధి చేసిన అధునాతన ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (FSD) టెక్నాలజీ పైనే ఆధారపడి ఉంటుంది. రోడ్డు మార్గాలను గుర్తించడం, ట్రాఫిక్‌ను అంచనా వేయడం, మలుపులు తిరగడం అంతా కృత్రిమ మేధస్సు ఆధారంగానే జరుగుతుంది. ఆస్టిన్ ప్లాంట్‌లో తయారయ్యే తొలి విడత సైబర్ క్యాబ్‌లలో టెస్లా తన శక్తివంతమైన ఎఐ4 (AI4) కంప్యూటింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తోంది. భవిష్యత్తులో మరింత అధునాతన ఎఐ4.5, ఎఐ5 హార్డ్‌వేర్ వెర్షన్లను కూడా పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

2024 నుంచి సాగుతున్న ప్రయోగాల ఫలితం

అమెరికన్ ఆటో దిగ్గజం టెస్లా తొలిసారిగా సైబర్ క్యాబ్ మోడల్‌ను అక్టోబర్ 2024లో ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ సమయంలో కాలిఫోర్నియాలోని క్లోజ్డ్ ట్రాక్‌పై ప్రయోగాత్మకంగా నడిపి ప్రయాణికులకు అనుభూతిని అందించింది. ప్రయోగాలు విజయవంతం కావడంతో డల్లాస్, హ్యూస్టన్, మయామి, ఓర్లాండో లాంటి నగరాల్లో డ్రైవర్ లేని మోడల్ Y కార్లతో రోబోటాక్సీ సేవలను పరిమిత ప్రాంతాల్లో పరీక్షించింది. జూలై 2026 నుంచి కంపెనీ ఉద్యోగులే స్వయంగా ఈ సైబర్ క్యాబ్‌లలో ప్రయాణిస్తూ విస్తృత స్థాయి ట్రయల్స్ నిర్వహించారు.

లీగల్ అనుమతులు, సేఫ్టీ అంశాలే ప్రధాన సవాలు

స్టీరింగ్, బ్రేక్ పెడల్స్ లేకపోవడం వల్ల అత్యవసర సమయంలో కారును ప్రయాణికులు నియంత్రించే అవకాశం లేకపోవడంతో భద్రతా పరమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆటోనమస్ డ్రైవింగ్ సాంకేతికతపై కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే నిబంధనల పీటముడి ఉంది. ఈ కారణాల వల్ల ప్రారంభంలో సైబర్ క్యాబ్‌ను పరిమిత ప్రాంతాల్లో మాత్రమే రోబోటాక్సీగా నడపనున్నారు. నిబంధనల సడలింపు, సాంకేతికతపై పూర్తి నమ్మకం కుదిరిన తర్వాత సేవలను ఇతర నగరాలకు విస్తరించాలని టెస్లా భావిస్తోంది.

Next Story