స్టాక్ క్లియర్ చేయడానికి రూ.2 లక్షల డిస్కౌంట్

Tesla : ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్లో తన ఉనికిని చాటుకోవడానికి ఇప్పుడు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తోంది. భారత్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఊహించిన స్థాయిలో అమ్మకాలు జరగకపోవడంతో కంపెనీ తన వ్యూహాన్ని మార్చుకుంది. నిల్వ ఉన్న పాత స్టాక్‎ను క్లియర్ చేసేందుకు మోడల్ Y పై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది.

ప్రస్తుతం టెస్లా తన ఏకైక మోడల్ అయిన Model Y పై దాదాపు రూ.2,00,000 వరకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా స్టెల్త్ గ్రే రంగులో ఉండి, ఆల్-బ్లాక్ ఇంటీరియర్‌తో ఉన్న స్టాండర్డ్ రేంజ్ వేరియంట్లపై ఈ తగ్గింపు లభిస్తోంది. 2025 సంవత్సరంలో దిగుమతి చేసుకున్న కార్లు సుమారు 100 యూనిట్లు విక్రయించబడకుండా షోరూమ్‌లలోనే ఉండిపోవడంతో, ఈ ఇన్వెంటరీ క్లియరెన్స్ సేల్‌ను టెస్లా ప్రారంభించింది. సాధారణంగా టెస్లా తన ధరలను బహిరంగంగా తగ్గించదు, కానీ ప్రస్తుతం టెస్ట్ డ్రైవ్ తీసుకునే కస్టమర్లకు మరియు ఆసక్తి ఉన్నవారికి వ్యక్తిగతంగా ఈ ఆఫర్లను వివరిస్తోంది.

భారత మార్కెట్లో టెస్లా కార్లు పూర్తిస్థాయిలో దిగుమతి చేసుకున్నవి కావడంతో, వీటిపై దాదాపు 110 శాతం వరకు కస్టమ్స్ డ్యూటీ పడుతోంది. దీనివల్ల మోడల్ Y ప్రారంభ ధర దాదాపు రూ.59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ఆన్-రోడ్ ధర రూ.70 లక్షల వరకు చేరుతోంది. అదే బడ్జెట్‌లో స్థానికంగా తయారయ్యే లేదా అసెంబుల్ అయ్యే బీవైడీ సీలయన్ 7, బీఎమ్‌డబ్ల్యూ iX1 వంటి కార్లు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో లభిస్తున్నాయి. 2025 మొత్తంలో టెస్లా కేవలం 227 కార్లను మాత్రమే విక్రయించగలిగింది, ఇది కంపెనీ ఆశించిన 600-800 బుకింగ్స్ కంటే చాలా తక్కువ.

టెస్లా ఇండియా ఇప్పుడు లంబోర్ఘిని ఇండియా మాజీ చీఫ్ శరద్ అగర్వాల్ చేతుల్లోకి వచ్చింది. లగ్జరీ కార్ల మార్కెట్లో ఆయనకున్న అపారమైన అనుభవంతో టెస్లాను మళ్ళీ గాడిలో పెట్టాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటివరకు టెస్లా కార్యకలాపాలను విదేశాల నుంచి పర్యవేక్షించగా, ఇప్పుడు శరద్ అగర్వాల్ నేరుగా భారత్ నుంచే ఆపరేషన్లను నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో దేశీయంగా కార్లను అసెంబుల్ చేయడం లేదా కొత్త మోడల్స్ (Model 3) లాంచ్ చేయడం ద్వారా ధరలను తగ్గించాలని టెస్లా ప్లాన్ చేస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story