Tesla : టెస్లా కార్లు వచ్చేశాయ్.. కానీ ధరలు మాత్రం మామూలుగా లేవు!
కానీ ధరలు మాత్రం మామూలుగా లేవు!

Tesla : అమెరికన్ బిలియనీర్ ఎలోన్ మస్క్ సంస్థ టెస్లా, భారతదేశంలో తన అరంగేట్రం చేసింది. ముంబైలో మొదటి షోరూమ్ తెరిచిన ఈ సంస్థ, త్వరలో ఢిల్లీలో కూడా కొత్త షోరూమ్ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్ నగరాలలో కార్ల బుకింగ్‌లు ప్రారంభించింది. అయితే, బుక్ చేసుకున్న వారికి కార్ల డెలివరీ కోసం కొంత కాలం వేచి ఉండక తప్పదు.
టెస్లా కంపెనీ, ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ 'వై' ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు వేర్వేరు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. రియర్-వీల్ డ్రైవ్ ప్రారంభ ధర రూ.59.89 లక్షలు, లాంగ్-రేంజ్ రియర్-వీల్ డ్రైవ్ ధర రూ.67.89 లక్షలు. ఈ కార్లు పూర్తిగా చైనాలోని షాంఘై ప్లాంట్ నుండి దిగుమతి అవుతాయి. ప్రస్తుతం భారతదేశంలో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే విషయంపై టెస్లా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. భారతీయ మార్కెట్ స్పందనను బట్టి భవిష్యత్తులో తయారీని మొదలుపెట్టే అవకాశం ఉంది.
చైనాలో కేవలం రూ.31 లక్షలు ఉన్న మోడల్ వై కారు, భారతదేశంలో మాత్రం దాదాపు రూ.60 లక్షలకి పైగా అమ్ముడవుతోంది. దీనికి ప్రధాన కారణం భారీగా ఉన్న దిగుమతి సుంకాలు. కారు అసలు ధర సుమారు రూ.27 లక్షలు. దిగుమతి సుంకం, ఇతర పన్నులు కలుపుకుంటే సుమారు రూ.21 లక్షలు. భారతదేశంలో ధర సుమారు రూ.60 లక్షలు అంటే అమెరికా కన్నా రూ.28 లక్షలు ఎక్కువ అన్నమాట. ఇతర దేశాల ధరలతో పోలిస్తే, అమెరికాలో రూ.38 లక్షలు, జర్మనీలో రూ.46 లక్షలకే ఈ కారు లభిస్తోంది. కానీ భారతదేశంలో మాత్రం దిగుమతి పన్నుల కారణంగా ధరలు రెట్టింపు అయ్యాయి.
ఈ కారులో కొన్ని అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండు మోడల్స్ కూడా కేవలం 6 సెకన్ల లోపే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. ఆటో పైలట్, ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్లు ఉన్నప్పటికీ, ప్రస్తుతం భారతదేశంలో వీటిని ఉపయోగించడానికి అనుమతి లేదు. ఇందులో ఆటో బ్రేక్ సిస్టమ్ ఉంది. అత్యవసర పరిస్థితుల్లో కారు ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. అలాగే, ఇతర వాహనాలు దగ్గరికి వచ్చినప్పుడు అలారం మోగుతుంది.టెస్లా షోరూంలలోనే సర్వీస్, స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంటాయి.

