Tesla Model Y : ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచాన్ని శాసిస్తున్న ఎలాన్ మాస్క్ సంస్థ టెస్లా.. ఎట్టకేలకు భారతీయ కార్ల ప్రియుల కలలను నిజం చేస్తూ అధికారికంగా సరికొత్త సంచలనానికి తెరలేపింది. భారత ఈవీ మార్కెట్లో తన పట్టును బలపరుచుకోవడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన 2026 టెస్లా మోడల్ Y ప్రీమియం ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్‌ను దేశీయ మార్కెట్లోకి గ్రాండ్‌గా లాంచ్ చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను కేవలం రూ.50.89 లక్షలుగా నిర్ణయించి భారతీయ లగ్జరీ కార్ల తయారీ కంపెనీలకు గట్టి షాక్ ఇచ్చింది. గతంలో రూ.67.80 లక్షల భారీ ధరతో ఉన్న లాంగ్ రేంజ్ ప్రీమియం మోడల్ స్థానంలో.. ఈ సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ వెర్షన్‌ను టెస్లా తీసుకురావడం విశేషం. దీనితో ప్రస్తుతం భారతదేశంలో టెస్లా నుంచి ప్రీమియం ఆర్‌డబ్ల్యూడీ, ఎల్ ప్రీమియం ఏడబ్ల్యూడీ అనే రెండు అదిరిపోయే వేరియంట్లు కస్టమర్లకు అందుబాటులోకి వచ్చాయి. ఈ సరికొత్త రాయల్ ఈ-కారు డెలివరీలు జూలై 2026 నుండి ప్రారంభం కానున్నాయి.

టెస్లా కంపెనీ భారతీయ మోడల్ వై ఖచ్చితమైన బ్యాటరీ సామర్థ్యం లేదా మోటారు పర్ఫార్మెన్స్ లెక్కలను అధికారికంగా ప్రకటించనప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో 64 kWh సామర్థ్యం గల పవర్ఫుల్ బ్యాటరీ ప్యాక్‌తో పాటు వెనుక వైపు అమర్చిన అధునాతన ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించారు. ఈ మోటార్ ఏకంగా 299 hp ల మైండ్ బ్లోయింగ్ పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ కారు ఏకంగా 500 కిలోమీటర్ల లాంగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. లాంగ్ డ్రైవ్స్, వీకెండ్ ట్రిప్స్ ఇష్టపడే వారికి ఈ రేంజ్ ఒక అద్భుతమైన ఆప్షన్.

ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ కారు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది రోడ్డుపై రాకెట్ లాగా దూసుకెళ్తుంది. కేవలం 5.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌ను ఈ కారు అందుకోగలదు. దీని టాప్ స్పీడ్ గంటకు 201 కిలోమీటర్లుగా నిర్ధారించారు. ఛార్జింగ్ పరంగా కూడా టెస్లా ఇందులో ఇండస్ట్రీ బెస్ట్ టెక్నాలజీని వాడింది. టెస్లాకు చెందిన అఫీషియల్ సూపర్ చార్జర్‌కు కనెక్ట్ చేసినప్పుడు.. 175 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 15 నిమిషాల అతి తక్కువ వ్యవధిలోనే ఏకంగా 238 కిలోమీటర్ల ప్రయాణానికి సరిపడా బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది.

కారు లోపలి భాగం అల్ట్రా లగ్జరీ, ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో మెరిసిపోతోంది. ఐదుగురు ప్రయాణీకులు చాలా సౌకర్యవంతంగా కూర్చునేలా డిజైన్ చేసిన ఈ మోడల్ వై కారు.. ఆల్-బ్లాక్ లేదా జెన్ గ్రే ఇంటీరియర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఐదు సీట్ల కారులో సీట్లను ఫోల్డ్ చేయడం ద్వారా ఏకంగా 2,138 లీటర్ల గరిష్ట స్టోరేజ్ కెపాసిటీ లభిస్తుందని టెస్లా వెల్లడించింది. ఇంత పెద్ద డిక్కీ స్పేస్ ఈ సెగ్మెంట్ లోనే మరే కారులోనూ లేదు. అంతేకాదు, ఈ ఎంట్రీ లెవెల్ కారులో డ్యాష్‌బోర్డ్ మధ్యలో 16-ఇంచుల భారీ ముఖ్య టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో పాటు, వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణీకుల వినోదం కోసం ప్రత్యేకంగా మరొక 8.0-ఇంచుల రేర్ టచ్‌స్క్రీన్‌ను కూడా అమర్చారు.

ఫీచర్ల విషయానికి వస్తే ఎలాన్ మాస్క్ కారులో ఏ లోటూ లేకుండా అన్నింటినీ లోడ్ చేశారు. ఇందులోలగ్జరీ పనోరమిక్ సన్‌రూప్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, వెనుక ప్రయాణీకులకు పవర్ రెక్లైనింగ్, ఫోల్డింగ్ సీట్లు, స్మార్ట్ పవర్ టెయిల్‌గేట్, మొబైల్స్ కోసం వైర్‌లెస్ ఛార్జింగ్, క్యాబిన్ లోపలికి బయటి శబ్దాలు రాకుండా అడ్డుకునే అకౌస్టిక్ గ్లాస్ వంటి ఎన్నో వరల్డ్ క్లాస్ లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో గ్లోబల్ బ్రాండ్ టెస్లా కారును సొంతం చేసుకోవాలనుకునే భారతీయ లగ్జరీ ఈవీ లవర్స్‌కు ఈ మోడల్ వై ప్రీమియం ఆర్‌డబ్ల్యూడీ ఒక అద్భుతమైన పండగ లాంటి ఛాయిస్.

PolitEnt Media

PolitEnt Media

Next Story