Tesla: డ్రైవర్ సాయంతో ఆటోమేటిక్‌గా బ్రేక్ వేసే కార్లను మీరు ఇప్పటివరకు చూసే ఉంటారు. కానీ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అంతకంటే ఒక అడుగు ముందుకేసి, అసలు స్టీరింగ్ వీల్, యాక్సిలరేటర్, బ్రేక్ పెడల్స్ ఏవీ లేని ఫ్యామిలీ కారును తీసుకురావాలని యోచిస్తోంది. అంటే కారులో కూర్చున్న వారు డ్రైవింగ్ చేయాల్సిన అవసరమే ఉండదు, కేవలం ప్రయాణాన్ని ఆస్వాదిస్తే చాలు. న్యూయార్క్ టైమ్స్ వార్షిక డీల్‌బుక్ సమ్మిట్‌లో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ఈ ప్రణాళికపై కీలక సంకేతాలు ఇచ్చారు. మోడల్ వై, మోడల్ వై ఎల్ కార్లను పూర్తిస్థాయి డ్రైవర్‌లెస్ వెర్షన్లలో తెచ్చే పనిలో ఉన్నామని, వీటిని రోబోటాక్సీ సేవలతో పాటు భవిష్యత్తులో సాధారణ కస్టమర్లకూ విక్రయించవచ్చని ఆయన తెలిపారు.

మోడల్ వైపై మస్క్ ఫోకస్

ప్రస్తుతం టెస్లా తన రోబోటాక్సీ సేవల్లో స్టీరింగ్, పెడల్స్, ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (FSD) సిస్టమ్ ఉన్న సాధారణ మోడల్ వై కార్లనే వాడుతోంది. 2024 అక్టోబర్‌లో టెస్లా స్టీరింగ్, పెడల్స్ లేని సైబర్‌క్యాబ్ కారును పరిచయం చేసినా, అందులో కేవలం ఇద్దరు మాత్రమే కూర్చునే వీలుంది. పెద్ద కుటుంబాలకు అది సరిపోదు కాబట్టి, మోడల్ వై డ్రైవర్‌లెస్ వెర్షన్ మెరుగైన ప్రత్యామ్నాయంగా మారుతుందని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం మోడల్ వైలో ఐదుగురు, మోడల్ వై ఎల్‌లో ఆరుగురు ప్రయాణించగలరు. ఇప్పుడు 6 నుంచి 7 మంది కూర్చునే కారు తెస్తామని మస్క్ చెప్పడంతో అంతకంటే పెద్ద మోడల్ రావచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రైవేట్ కొనుగోలుదారులకు సైబర్‌క్యాబ్

ఈ కొత్త డ్రైవర్‌లెస్ కారు ఎప్పుడు లాంచ్ అవుతుంది, ధర ఎంత ఉంటుందనే వివరాలను మస్క్ ఇంకా వెల్లడించలేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చైనాలో మోడల్ వై ఎల్ లాంచ్ చేసినప్పుడు దాన్ని అమెరికాకు తీసుకురాబోనని మస్క్ చెప్పారు, కానీ ఏడాదిలోపే తన మనసు మార్చుకున్నారు. మరోవైపు ప్రైవేట్ కస్టమర్లకు కూడా సైబర్‌క్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చే ప్లాన్ ఉందని టెస్లా ఇటీవల తెలిపింది. అయితే దీనికి ఖరీదైన సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి రావచ్చని, పైగా కంపెనీ నిర్ణయించిన పరిమిత ప్రాంతాల్లో మాత్రమే కారు నడుస్తుందని సమాచారం.

చట్టపరమైన అడ్డంకులే పెద్ద సవాలు

స్టీరింగ్, పెడల్స్ లేని ఫ్యామిలీ కారును మార్కెట్లోకి తీసుకురావడం టెస్లాకు అంత సులభం కాదు. అమెరికాలో ఇలాంటి వాహనాలపై కఠినమైన ప్రభుత్వ నిబంధనలు, సాంకేతిక, చట్టపరమైన సవాళ్లు ఉన్నాయి. సైబర్‌క్యాబ్‌ను టెస్లా స్వయంగా సర్టిఫై చేసుకోవడంపై ఇప్పటికే ప్రశ్నలు తలెత్తగా, అమెరికా రోడ్డు భద్రతా సంస్థ దీనిపై విచారణ జరుపుతోంది. దీనికి తోడు, అత్యవసర పరిస్థితుల్లో సొంతంగా నడుపుకునే వీలు లేని, కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కారును జనం కొంటారా అన్నది కూడా పెద్ద ప్రశ్నగా మారింది.

సైబర్‌ట్రక్, మోడల్ ఎస్ బంద్

టెస్లా ఇటీవల తన కార్ల వ్యూహంలో భారీ మార్పులు చేసింది. సైబర్‌ట్రక్ ఉత్పత్తిని నిలిపివేయడంతో పాటు మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లను కూడా బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం మోడల్ వై, మోడల్ వై ఎల్, మోడల్ 3 మాత్రమే టెస్లా ప్రధాన కార్లుగా మిగిలాయి. భారత్ లాంటి మార్కెట్ల కోసం తక్కువ ధర ఎలక్ట్రిక్ కారు తెచ్చే ప్లాన్‌ను కూడా పక్కనపెట్టి సైబర్‌క్యాబ్‌పైనే దృష్టి పెట్టింది. మరోవైపు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రోడ్‌స్టర్ సూపర్‌కార్ ప్రోటోటైప్‌ను చూపించినా, దాని ఉత్పత్తి మొదలవ్వడానికి ఇంకా ఏడాదికి పైగా పట్టే అవకాశం ఉంది.

Next Story