ఈ నగరాల్లో సూపర్ ఛార్జింగ్ స్టేషన్లు

Tesla: అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, భారతదేశంలో తమ విస్తరణను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబైలలో షోరూమ్‌లు తెరిచిన టెస్లా, ఇప్పుడు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో తమ సూపర్‌ఛార్జింగ్ నెట్‌వర్క్ ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. గత నెలలోనే భారతదేశంలో టెస్లా మోడల్-వై ఎలక్ట్రిక్ కారును రూ. 59.89 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసిన టెస్లా, కస్టమర్లందరికీ మెరుగైన సేవలు అందించేందుకు ఈ చర్యలు చేపట్టింది. బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. అయితే డెలివరీలకు మాత్రం ఇంకొంత సమయం పట్టనుంది.

తాజాగా ఢిల్లీలోని ఏరోసిటీలో తమ రెండో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. టెస్లా రీజినల్ డైరెక్టర్ (సౌత్ ఈస్ట్ ఏషియా) ఇసాబెల్ ఫ్యాన్ మాట్లాడుతూ.. తమకు ఢిల్లీ, ముంబై నగరాలు చాలా ముఖ్యమని అన్నారు. రాబోయే వారాల్లో గురుగ్రామ్‌లో మొదటి సూపర్‌ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత దక్షిణ ఢిల్లీలోని సాకేత్, నోయిడాలో కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ముంబై విషయానికి వస్తే, ఇప్పటికే ఉన్న బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ ఛార్జింగ్ పాయింట్‌తో పాటు, త్వరలో లోవర్ పరేల్, నవీ ముంబై, థానేలలో కొత్త సూపర్‌ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని టెస్‌లా ప్లాన్ చేస్తోంది.

అంతేకాకుండా, ఇసాబెల్ ఫ్యాన్ త్వరలో బెంగళూరు, హైదరాబాద్ వంటి కొత్త మార్కెట్‌లలోకి కూడా అడుగుపెడతామని తెలిపారు. అనవసరమైన పెద్ద హామీలు ఇవ్వకుండా, సాధించగలిగే చిన్న చిన్న లక్ష్యాలను మాత్రమే ప్రకటిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను పెంచడంతో పాటు, కస్టమర్ల కోసం మొబైల్ సర్వీస్, రిమోట్ డయాగ్నోస్టిక్స్, ఒక ప్రత్యేకమైన సర్వీస్ సెంటర్, ఇంకా టెస్లా ఆమోదించిన కొలిజన్ సెంటర్‌లను కూడా భారత్‌లో ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది.

టెస్లా కారు కోసం బుక్ చేసుకున్నవారు డెలివరీ కోసం ఇంకా వేచి చూడాల్సిందే. కంపెనీ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఇప్పుడు ఆర్డర్ చేసిన కస్టమర్లకు రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్ డెలివరీ 2025లో మూడో త్రైమాసికంలో ప్రారంభమవుతుంది. అదేవిధంగా లాంగ్ రేంజ్ డ్రైవ్ వేరియంట్ డెలివరీ అదే సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మొదలవుతుంది. టెస్లా అధికారిక ఇండియా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు చేసుకోవచ్చు. బుకింగ్ కోసం రూ. 22,220 డిపాజిట్, రూ. 50,000 అడ్మినిస్ట్రేషన్, సర్వీస్ ఫీజు చెల్లించాలి. ప్రస్తుతం, మోడల్ Y కారు బుకింగ్స్ దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ, టెస్లా మొదటి దశలో ముంబై, పూణే, ఢిల్లీ, గురుగ్రామ్‌ నగరాల్లో మాత్రమే డెలివరీలను ప్రారంభిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story