KTM : ఆఫ్ రోడింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. కేటీఎం కొత్త అడ్వెంచర్ బైక్ వచ్చేసింది
కేటీఎం కొత్త అడ్వెంచర్ బైక్ వచ్చేసింది

KTM : భారత మార్కెట్‌లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కేటీఎం 390 అడ్వెంచర్ ఎండ్యూరో ఆర్ ఎట్టకేలకు లాంచ్ అయ్యింది. ఆస్ట్రియన్ వాహన తయారీ సంస్థ కేటీఎం తమ గ్లోబల్-స్పెక్ మోడల్‌ను భారత మార్కెట్‌కు తీసుకురావడంతో ఆఫ్-రోడింగ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఏప్రిల్ 2025లో కేటీఎం ఇండియా 390 ఎండ్యూరో ఆర్ ని విడుదల చేసినప్పుడు, అది అంతర్జాతీయ మోడల్ కంటే కొంచెం తక్కువ ఫీచర్లతో వచ్చిందని కస్టమర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంది. కస్టమర్ల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, కంపెనీ ఇంటర్నేషనల్ మోడల్‌ను దేశంలో విడుదల చేస్తామని ప్రకటించింది. తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ కంపెనీ రూ.3.54 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఇంటర్నేషనల్ మోడల్ KTM 390 ఎండ్యూరో R ని లాంచ్ చేశారు.
ఈ కొత్త గ్లోబల్-స్పెక్ ఎండ్యూరో R మోడల్ ప్రారంభ ధర రూ.3.54 లక్షలు (ఎక్స్-షోరూమ్). కాగా, గతంలో లాంచ్ చేసిన ఎండ్యూరో R వెర్షన్ ఇప్పటికీ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.3.38 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ రెండు వెర్షన్‌ల మధ్య సుమారు రూ.16,000 ధర వ్యత్యాసం ఉంది. అంతేకాకుండా, బ్రాండ్ తమ ఇంటర్నేషనల్-స్పెక్ మోడల్‌కు ఓజీ ఆఫ్-రోడ్ ఐకాన్ అని పేరు పెట్టింది.
కేటీఎం 390 అడ్వెంచర్ ఎండ్యూరో R గ్లోబల్ వేరియంట్‌లో ముందు, వెనుక రెండు వైపులా 230 మిమీ సస్పెన్షన్ ట్రావెల్, 272 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 890 మిమీ సీటు ఎత్తు ఉన్నాయి. ఇది ఆఫ్-రోడింగ్‌కు మరింత అనుకూలంగా ఉంటుంది. కాగా, గతంలో భారతదేశంలో లాంచ్ అయిన వెర్షన్‌లో ముందు 200 మిమీ, వెనుక 205 మిమీ ట్రావెల్, 253 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 860 మిమీ సీటు ఎత్తు ఉన్నాయి. టైర్ల విషయానికి వస్తే, ఇంటర్నేషనల్-స్పెక్ మోడల్‌లో మెట్జెలర్ కారు టైర్లు ఉండగా, భారత-స్పెక్ వేరియంట్‌లో మిటాస్ ఎండ్యూరో ట్రైల్ టైర్లు అమర్చారు. ఇది ఆఫ్ రోడ్ జర్నీకి బాగా ఉంటాయి.
కేటీఎం 390 అడ్వెంచర్ ఎండ్యూరో R లో అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో పవర్ ఫుల్ LED హెడ్‌లైట్లు ఉన్నాయి. ఇవి రాత్రిపూట అద్భుతమైన వెలుతురును అందిస్తాయి. బైక్‌లో 4.2 అంగుళాల TFT స్క్రీన్ అమర్చబడింది. ఈ డిజిటల్ డాష్‌బోర్డ్ ద్వారా రైడర్ మ్యూజిక్‌ను ప్లే చేయవచ్చు, కాల్‌లను స్వీకరించవచ్చు, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను చూడవచ్చు. రైడింగ్ మోడ్‌లను కూడా మార్చవచ్చు. దీంతో పాటు, డివైజ్‌లను ఛార్జ్ చేయడానికి USB-C పోర్ట్ సౌకర్యం కూడా ఉంది.
