దీని ముందు ఏ కారైనా బలాదూరే

Hyundai Creta : ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటైన హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు తన మూడవ తరం మోడల్‌తో సరికొత్త అవతారంలోకి మారబోతోంది. ఇది కేవలం పాత కారుకు మెరుగులు దిద్దడం మాత్రమే కాకుండా, పూర్తిగా కొత్త ప్లాట్‌ఫారమ్, సరికొత్త టెక్నాలజీతో రీబూట్ అవుతోంది. కొత్త 3వ తరం క్రెటా డిజైన్ విషయంలో విప్లవాత్మక మార్పులు ఉండబోతున్నాయి. ప్రస్తుత మోడల్ కంటే ఇది మరింత మస్కులర్, బాక్సీ లుక్ లో ఉండబోతోంది. ఇది చూడటానికి హ్యుందాయ్ లగ్జరీ ఎస్‌యూవీ పాలిసేడ్ లేదా నెక్సో నుంచి స్ఫూర్తి పొందినట్లు కనిపిస్తుంది. భారీ గ్రిల్, నిలువుగా ఉండే ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వంటి ఫీచర్లు దీనికి ఒక ప్రీమియం ఎస్‌యూవీ రూపాన్ని ఇస్తాయి. కారు పొడవు, వెడల్పు కూడా పెరగడం వల్ల లోపల స్పేస్ ఎక్కువగా ఉంటుంది.

కొత్త క్రెటా హ్యుందాయ్-కియా సంయుక్తంగా అభివృద్ధి చేసిన K3 ప్లాట్‌ఫారమ్ పై ఆధారపడి ఉంటుంది. ఇదే ప్లాట్‌ఫారమ్ రాబోయే కియా సెల్టోస్ కొత్త మోడల్‌లో కూడా చూడవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్ వల్ల కారు మరింత ధృడంగా మారడమే కాకుండా, క్రాష్ టెస్టుల్లో మెరుగైన రేటింగ్ సాధించే అవకాశం ఉంది. భద్రత కోసం ఇందులో అప్‌డేటెడ్ లెవల్-2 ADAS, 360-డిగ్రీ కెమెరా, మరిన్ని ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్ గా రానున్నాయి.

కారు లోపల మూడు స్క్రీన్ల సెటప్ ఉండే అవకాశం ఉంది (డిజిటల్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్, ప్యాసింజర్ డిస్‌ప్లే). పాత 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో పాటు, మొదటిసారిగా క్రెటాలో స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ రాబోతోంది. ఇది లీటరుకు సుమారు 25-30 కి.మీ. మైలేజీ ఇచ్చే అవకాశం ఉంది. పనోరమిక్ సన్‌రూఫ్, వెనక సీట్లకూ వెంటిలేషన్, పవర్డ్ సీట్లు, అడ్వాన్స్‌డ్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటివి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ప్రస్తుతం దక్షిణ కొరియా, ఇతర దేశాల్లో ఈ కారు టెస్టింగ్ దశలో ఉంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, హ్యుందాయ్ ఈ మూడవ తరం క్రేటాను 2027 ప్రారంభంలో లేదా ఫిబ్రవరి 2027 నాటికి భారత మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని ధరలు సుమారు రూ.11.50 లక్షల నుంచి రూ.21.50 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story