Renault Duster : కౌంట్‌డౌన్ స్టార్ట్..మరో 60 రోజుల్లో కొత్తగా ముస్తాబై రెనాల్ట్ డస్టర్ ఎంట్రీ
మరో 60 రోజుల్లో కొత్తగా ముస్తాబై రెనాల్ట్ డస్టర్ ఎంట్రీ

Renault Duster : భారతీయ మార్కెట్‌లో ఒకప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీలలో ఒకటైన రెనాల్ట్ డస్టర్ మళ్లీ తిరిగి రావడానికి సిద్ధమవుతోంది. కొత్త తరం రెనాల్ట్ డస్టర్ జనవరి 26, 2026 న భారతదేశంలో లాంచ్ కానుంది. కొన్ని సంవత్సరాల క్రితం డస్టర్‌ను ఇండియాలో నిలిపివేసినప్పటికీ దాని స్ట్రాంగ్ డిజైన్, డీజిల్ ఇంజిన్ కారణంగా పాత కార్ల మార్కెట్‌లో దీనికి ఇప్పటికీ చాలా డిమాండ్ ఉంది. ఈ ఎస్‌యూవీ తిరిగి వస్తుందనే అధికారిక ప్రకటనతో దేశంలోని కారు లవర్స్లో ఉత్సాహం మళ్లీ పెరిగింది. రాబోయే ఈ కొత్త మోడల్‌లో ఉన్న ముఖ్య మార్పులు , ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం.
నెక్స్ట్-జెన్ రెనాల్ట్ డస్టర్, రెనాల్ట్ కంపెనీ CNF-B ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి తయారైంది. ఈ ప్లాట్‌ఫారమ్ పాత మోడల్ కంటే చాలా బలంగా, దృఢంగా ఉంటుంది. కొత్త డస్టర్ తన దృఢమైన రూపాన్ని కొనసాగిస్తుంది. మునుపటి కంటే మరింత పెద్దగా, వెడల్పుగా, బోల్డ్‌గా కనిపిస్తుంది. భారతదేశంలో విడుదలయ్యే డస్టర్, అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న డిజైన్ , కాంపాక్ట్ సైజునే కొనసాగించే అవకాశం ఉంది. ధర విషయంలో ఇది చాలా ముఖ్యమైన అంశం.
కొత్త తరం రెనాల్ట్ డస్టర్ ఇంటీరియర్, ఫీచర్లలో కూడా అనేక మార్పులు చేశారు. పాత మోడల్‌తో పోలిస్తే, ఇందులో కొత్త, పెద్ద ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా వంటి మోడ్రన్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో జోడించబడే అవకాశం ఉంది. ప్రయాణీకులకు ఎక్కువ స్థలం ఉండేలా క్యాబిన్‌ను విస్తరించారు. అలాగే బూట్ స్పేస్ కూడా పెరిగే అవకాశం ఉంది.
భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా తీసుకురానున్న రెనాల్ట్ డస్టర్‌లో 1.2-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ పవర్‌ట్రైన్ ఉంటుందని అంచనా. ఈ ఇంజిన్ గరిష్టంగా 128 బీహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా ఈ ఎస్‌యూవీ మంచి మైలేజీని అందిస్తూ, వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మారుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో 1.6-లీటర్ ఇంజిన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 1.2 kWh బ్యాటరీతో కూడిన ఫుల్-హైబ్రిడ్ మోడల్ అందుబాటులో ఉన్నప్పటికీ, భారతదేశంలో దానిని విడుదల చేసే అవకాశం తక్కువగా ఉంది.

