Dash Cams : ప్రస్తుత కాలంలో రహదారి భద్రత అనేది ఎంతో కీలకంగా మారింది. రద్దీగా ఉండే రోడ్లపై ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఊహించలేం. ఇలాంటి పరిస్థితుల్లో డ్రైవర్లకు రక్షణ కవచంలా మారుతోంది ఒక చిన్న పరికరం.. అదే డ్యాష్ క్యామ్. కేవలం ఒక చిన్న కెమెరా లాంటి ఈ డివైజ్, రోడ్డుపై జరిగే గొడవలను పరిష్కరించడమే కాకుండా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ పొందడంలో కూడా కీలకంగా మారుతోంది. ఈ చిన్న పరికరం వల్ల కలిగే ప్రయోజనాలు, ఇతర వివరాలు తెలుసుకుందాం.

డ్యాష్ క్యామ్ అంటే ఏమిటి?

డ్యాష్ క్యామ్ అనేది ఒక చిన్న డిజిటల్ కెమెరా. దీనిని కారు లోపలి వైపు విండ్‌షీల్డ్‌కు లేదా డాష్‌బోర్డ్‌కు అమర్చుతారు. ఇంజిన్ స్టార్ట్ చేయగానే ఇది ఆటోమేటిక్‌గా రికార్డింగ్‌ను ప్రారంభిస్తుంది. ఇది నిరంతరం రోడ్డుపై జరిగే దృశ్యాలను వీడియో తీస్తూనే ఉంటుంది. కొన్ని అత్యాధునిక డ్యాష్ క్యామ్‌లు రోడ్డుతో పాటు కారు లోపల జరిగే ముచ్చట్లను, దృశ్యాలను కూడా రికార్డ్ చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఇవి రూ.5 వేల నుంచి రూ.10 వేల మధ్య లభిస్తున్నాయి. కెమెరా క్వాలిటీ, స్టోరేజ్ సామర్థ్యాన్ని బట్టి ధరలు మారుతుంటాయి.

దీనివల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు

డ్యాష్ క్యామ్ వల్ల కలిగే ప్రధాన లాభం ప్రమాదాల సమయంలో సాక్ష్యంగా నిలవడం. ఒకవేళ కారు ప్రమాదానికి గురైతే, తప్పు ఎవరిదో స్పష్టమైన వీడియో సాక్ష్యం మన దగ్గర ఉంటుంది. దీనివల్ల పోలీసు కేసుల నుంచి, కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు కంపెనీలు అడిగే ప్రశ్నలకు ఈ వీడియోనే సమాధానం చెబుతుంది. నకిలీ యాక్సిడెంట్లు సృష్టించి డబ్బులు వసూలు చేసే మోసగాళ్ల ఆట కట్టించడానికి ఇది ఒక అస్త్రంలా పనిచేస్తుంది.

డ్రైవింగ్ చేసేటప్పుడు కెమెరా రికార్డ్ అవుతుందనే స్పృహ డ్రైవర్లలో ఉంటే, వారు ట్రాఫిక్ నిబంధనలను పాటించడానికి, సురక్షితంగా డ్రైవ్ చేయడానికి ప్రయత్నిస్తారు. హిట్ అండ్ రన్ కేసులు, రోడ్డు మీద ఎవరైనా దుర్భాషలాడటం వంటి సంఘటనలను కూడా ఇది రికార్డ్ చేస్తుంది. దీనివల్ల డ్రైవర్లకు ఒక విధమైన మనశ్శాంతి లభిస్తుంది. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే తన దగ్గర వీడియో సాక్ష్యం ఉందనే ధైర్యం వారికి ఉంటుంది.

కొన్ని జాగ్రత్తలు కూడా అవసరమే

అయితే డ్యాష్ క్యామ్ వాడటంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. నిరంతరం రికార్డ్ చేయడం వల్ల ఇతరుల ప్రైవసీకి భంగం కలుగుతుందనే వాదనలు ఉన్నాయి. క్వాలిటీ లేని డ్యాష్ క్యామ్‌లు ఎండ తీవ్రతకు లేదా చలికి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి బ్రాండ్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే, ఈ కెమెరాను డ్రైవర్ చూపుకు అడ్డు రాకుండా అమర్చుకోవాలి. కొన్ని ప్రదేశాలలో డ్యాష్ క్యామ్ వీడియోలను కోర్టులు సాక్ష్యంగా అంగీకరించకపోవచ్చు, కానీ ఇన్సూరెన్స్ సెటిల్‌మెంట్లలో మాత్రం ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story