River Indie : భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ రంగంలో ఒక కొత్త సంచలనం రేపుతోంది రివర్ ఇండి. ఓలా, ఏథర్ వంటి దిగ్గజ కంపెనీలు రాజ్యమేలుతున్న తరుణంలో, రివర్ మొబిలిటీ అనే స్టార్టప్ తనదైన ముద్ర వేస్తోంది. ఈ స్కూటర్ చూడటానికి గంభీరంగా ఉండటమే కాదు, ఫీచర్లు కూడా అదరగొడుతున్నాయి. అందుకే దీనిని ఈ-స్కూటర్ల ఎస్‌యూవీ అని పిలుస్తున్నారు. మార్చి 2026 నాటికి ఈ కంపెనీ అమ్మకాల్లో ఏకంగా 417 శాతం వృద్ధిని సాధించి, దేశంలోని టాప్ 10 ఈవీ బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది.

రివర్ ఇండి స్కూటర్ డిజైన్ కేవలం విలాసం కోసం కాకుండా, అవసరాలను తీర్చే ఒక టూల్ లాగా ఉంటుంది. దీని 14-అంగుళాల పెద్ద చక్రాలు, డ్యూయల్ హెడ్‌ల్యాంప్స్, గంభీరమైన రూపం దీనికి ఎస్‌యూవీ స్థాయి రోడ్ ప్రెజెన్స్‌ను ఇస్తాయి. సాధారణ స్కూటర్ల కంటే ఇది పెద్దదిగా, దృఢంగా కనిపిస్తుంది. దీని ఫుట్‌బోర్డ్ ఏరియా కూడా చాలా విశాలంగా ఉండటం వల్ల సామాన్లు పెట్టుకున్నా డ్రైవర్‌కు ఇబ్బంది ఉండదు.

ఈ స్కూటర్ యొక్క అతిపెద్ద బలం దాని స్టోరేజ్ కెపాసిటీ. ఇందులో ఏకంగా 43 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఉంది. అంటే మీరు ఒక ఫుల్-ఫేస్ హెల్మెట్, ఒక హాఫ్-ఫేస్ హెల్మెట్‌ను ఒకేసారి లోపల పెట్టేయొచ్చు. ఇది కాకుండా ముందు భాగంలో 12 లీటర్ల గ్లోవ్ బాక్స్ కూడా ఉంటుంది. మీకు ఇంకా అదనపు స్థలం కావాలంటే ఫోన్ మౌంట్, ఫ్లై స్క్రీన్ వంటి ఇతర యాక్సెసరీలను కూడా జోడించుకోవచ్చు.

రివర్ ఇండిలో మూడు రకాల రైడింగ్ మోడ్స్ (Eco, Ride, Rush) ఉన్నాయి. ఎకో మోడ్‌లో స్కూటర్ గరిష్టంగా 100 నుంచి 110 కి.మీ రేంజ్ ఇస్తుంది. రైడ్ మోడ్ సిటీలో రోజువారీ ప్రయాణాలకు బాగుంటుంది. ఇక రష్ మోడ్‌లో స్కూటర్ తన పూర్తి పవర్‌ను చూపిస్తుంది, కానీ ఇక్కడ రేంజ్ 70-75 కి.మీలకు తగ్గిపోతుంది. దీని రైడింగ్ క్వాలిటీ చాలా స్మూత్ గా ఉంటుంది, ముఖ్యంగా గుంతల రోడ్లపైన కూడా జంప్స్ తక్కువగా అనిపిస్తాయి.

సేఫ్టీ విషయంలో కంపెనీ రాజీ పడలేదు. రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. ఏబీఎస్ లేకపోయినా, బ్రేకింగ్ చాలా పక్కాగా ఉంటుంది. దీని పొడవాటి వీల్‌బేస్, తక్కువ సెంటర్ ఆఫ్ గ్రావిటీ వల్ల మలుపుల్లో కూడా బండి చాలా స్థిరంగా ఉంటుంది. ఇది కేవలం ఒక లోడింగ్ బండిలా కాకుండా, స్పోర్టీగా నడపడానికి కూడా సహకరిస్తుంది.

భారత మార్కెట్లో రివర్ ఇండి ధర రూ. 1.43 లక్షల నుంచి రూ. 1.52 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది. ఇది నేరుగా ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ వంటి పాపులర్ మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది. మీరు కేవలం షో కాకుండా, మంచి బలం, ఎక్కువ స్టోరేజ్, కంఫర్ట్ కోరుకుంటే రివర్ ఇండి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story