Automatic Cars : ప్రస్తుతం నగరాల్లో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు సర్వసాధారణంగా మారాయి. ఇలాంటి భారీ ట్రాఫిక్‌లో రోజువారీ ప్రయాణం చేయడం వాహనదారులకు పెద్ద నరకంగా మారుతోంది. ముఖ్యంగా మాన్యువల్ గేర్లు ఉన్న కార్లను నడిపేవారు పదే పదే క్లచ్ నొక్కడం, గేర్లు మార్చడం వల్ల తీవ్రమైన మోకాలి నొప్పులు, అలసటకు గురవుతున్నారు. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి చాలా మంది ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు ఆటోమేటిక్ కార్లు అంటే కేవలం ధనవంతులకే పరిమితం అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు మధ్యతరగతి బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు రూ.6 లక్షల బడ్జెట్ పరిధిలోనే అద్భుతమైన ఆటోమేటిక్ కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి.

టాటా టియాగో, టిగోర్

బడ్జెట్ ధరలో లగ్జరీ, సేఫ్టీని కోరుకునే వారికి టాటా మోటార్స్ రెండు అద్భుతమైన ఆప్షన్లను అందిస్తోంది. ఇందులో మొదటిది టాటా టియాగో. యువతను ఎంతగానో ఆకట్టుకునే ఈ హ్యాచ్‌బ్యాక్ కారులో 1.2 లీటర్ల పవర్‌ఫుల్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది మైలేజ్ పరంగా కూడా చాలా బెస్ట్ అనిపించుకుంది. ఇందులో పెట్రోల్‌తో పాటు సీఎన్‌జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉండటం విశేషం. ఈ రెండు ఇంధన ఆప్షన్లలోనూ ఏఎమ్‌టీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.6 లక్షలుగా ఉంది. ఇక సెడాన్ కార్లను ఇష్టపడే వారి కోసం టాటా టిగోర్ అందుబాటులో ఉంది. పెద్ద బూట్ స్పేస్, సౌకర్యవంతమైన సీట్లతో ఉండే ఈ ఫ్యామిలీ కారు ప్రారంభ ధర సుమారు రూ. 6.8 లక్షలుగా ఉంది.

నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ ఎక్స్టర్

ఈ రోజుల్లో కాంపాక్ట్, మైక్రో ఎస్‌యూవీలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్‌లో నిస్సాన్ మాగ్నైట్ ఒక సంచలనంగా నిలిచింది. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని ఇచ్చే సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.6.24 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మరోవైపు, ఫీచర్ల పరంగా కింగ్‌లా నిలిచే హ్యుందాయ్ ఎక్స్టర్ కూడా మంచి ఆప్షన్. అత్యాధునిక డిజైన్, సరికొత్త మోడరన్ ఫీచర్లు ఉన్న ఈ మైక్రో ఎస్‌యూవీలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ అందించారు. దీని ప్రారంభ ధర మార్కెట్లో సుమారు రూ.6.95 లక్షలుగా నిర్ణయించారు.

రెనాల్ట్ కైగర్ ఎస్‌యూవీ

చివరగా ఈ బడ్జెట్ లిస్టులో చెప్పుకోవాల్సింది రెనాల్ట్ కైగర్ గురించి. స్టైలిష్ లుక్స్‌తో స్పోర్టీగా కనిపించే ఈ కారు బడ్జెట్ ఎస్‌యూవీ విభాగంలో ఎంతో పాపులర్ అయింది. ఇందులో 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌తో పాటు పవర్‌ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. లాంగ్ డ్రైవ్స్ ఎక్కువగా వెళ్లేవారి కోసం ఇందులో అడ్వాన్స్‌డ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను మైంటైన్ చేశారు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 6.99 లక్షలుగా ఉంది. కాబట్టి, భారీ ట్రాఫిక్ కిరికిరి లేకుండా ప్రశాంతంగా, సురక్షితంగా ప్రయాణించాలనుకునే వారు తమ బడ్జెట్, అవసరాలకు తగినట్లుగా ఈ ఐదు కార్లలో ఏదో ఒకదానిని తక్కువ ధరలోనే సొంతం చేసుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story