Automatic SUVs: ప్రస్తుతం పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం పెరగడంతో చాలామంది వాహనదారులు డీజిల్ ఇంజిన్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్, అద్భుతమైన పవర్ ఇచ్చే కార్లకు డిమాండ్ పెరుగుతోంది. సిటీ ట్రాఫిక్‌లో గేర్లు మార్చే అవసరం లేకుండా హాయిగా ప్రయాణించేందుకు డీజిల్ ఆటోమేటిక్ కార్లు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి. భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 4 అఫార్డబుల్ డీజిల్ ఆటోమేటిక్ SUVల వివరాలు చూద్దాం.

1. కియా సోనెట్

ఈ జాబితాలో అత్యంత తక్కువ ధరకు లభించే డీజిల్ ఆటోమేటిక్ కారు కియా సోనెట్. ముంబైలో దీని ఆన్-రోడ్ ప్రారంభ ధర రూ.11.92 లక్షలుగా ఉంది. ఇందులో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 114 బిహెచ్‌పి పవర్, 250 ఎన్ఎం టార్క్ ఇస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేశారు. ఇది లీటరుకు 18.6 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ప్రీమియం ఇంటీరియర్, స్టైలిష్ లుక్ దీని ప్రత్యేకత.

2. టాటా నెక్సాన్

రెండో స్థానంలో టాటా నెక్సాన్ నిలిచింది. ప్యూర్ ప్లస్ డీజిల్ AT వేరియంట్ ముంబై ఆన్-రోడ్ ధర రూ.13.16 లక్షలుగా ఉంది. ఇందులో ఇచ్చే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 113 బిహెచ్‌‌పి పవర్, 260 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది. ఈ కారు ఏఆర్ఏఐ గుర్తింపు పొందిన ప్రకారం లీటరుకు 24.08 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అత్యుత్తమ సేఫ్టీ రేటింగ్స్, ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

3. మహీంద్రా XUV 3XO

మహీంద్రా సంస్థ తీసుకొచ్చిన ఈ కారు డీజిల్ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీని RevX Edge (O) డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ ముంబై ఆన్-రోడ్ ధర రూ. 14.39 లక్షలు. ఇందులో ఉన్న 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 115 బిహెచ్‌పి పవర్, 300 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ లిస్టులోని అన్ని కార్ల కంటే ఇందులో టార్క్ అత్యధికం కావడం విశేషం. ఇది లీటరుకు 21.2 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

4. హ్యుందాయ్ వెన్యూ

హ్యుందాయ్ వెన్యూ HX5 డీజిల్ వేరియంట్ ముంబై ఆన్-రోడ్ ధర రూ.14.47 లక్షలుగా ఉంది. దీనిలోని 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 114 బిహెచ్‌పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ ఇంజిన్‌తో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తుంది. ఇది లీటరుకు 17.9 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. డ్రైవింగ్ స్మూత్‌నెస్‌తో పాటు లాంగ్ రైడ్స్‌కు ఇది అనువుగా ఉంటుంది.

ఈ నాలుగు కార్లలో కియా సోనెట్ ప్రారంభ ధర పరంగా చౌకగా ఉండగా, టాటా నెక్సాన్ అత్యధిక మైలేజ్ ఇస్తోంది. రోడ్డుపై మంచి పవర్, టార్క్ కావాలనుకునే వారికి మహీంద్రా XUV 3XO ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది.

Next Story