Upcoming 7 Seater SUVs : ఫ్యామిలీ కారు కొంటున్నారా? దీపావళి నాటికి రాబోతున్న 4 మైండ్ బ్లాకింగ్ 7-సీటర్ SUVs ఇవే
4 మైండ్ బ్లాకింగ్ 7-సీటర్ SUVs ఇవే

Upcoming 7 Seater SUVs : పెద్ద కుటుంబాల కోసం 7-సీటర్ ఎస్‌యూవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే కొద్దిరోజులు వేచి చూడటం మంచిది. భారత మార్కెట్లో ఎస్‌యూవీలకు ఉన్న భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని టాటా, మహీంద్రా, కియా, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ వంటి దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు దీపావళి 2026 నాటికి సరికొత్త 7-సీటర్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్, ఆల్-ఎలక్ట్రిక్ వేరియంట్లతో రాబోతున్న ఆ 4 రోడ్‌మాస్టర్ ఎస్‌యూవీల వివరాలు చూద్దాం.
1. ఎంజీ హెక్టర్ హాక్ : జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా నుంచి వస్తున్న ఈ సరికొత్త ఎస్‌యూవీ కొత్త అడాప్ట్(ADAPT) ప్లాట్‌ఫారమ్‌పై రూపొందుతోంది. గ్లోబల్ మార్కెట్‌లోని వులింగ్ స్టార్‌లైట్ 560 మోడల్ ఆధారంగా రూపొందుతున్న ఈ ఎస్‌యూవీ మార్కెట్లోకి ఎంజీ హెక్టర్ హాక్ పేరుతో రానుంది. ఇందులో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) పవర్‌ట్రెయిన్ ఆప్షన్ ఉండనుంది. బాక్సీ డిజైన్, 12.8-ఇంచ్ టచ్‌స్క్రీన్, లెవెల్-2 ADAS వంటి హైటెక్ ఫీచర్లతో దీపావళి నాటికి ఇది భారత్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది.
2. మహీంద్రా స్కోర్పియో N ఫేస్‌లిఫ్ట్ : భారత మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న మహీంద్రా స్కార్పియో N సరికొత్త ఫేస్‌లిఫ్ట్ అవతార్‌లో రాబోతోంది. ఎక్స్‌టీరియర్‌లో రీ-డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్స్, అప్‌డేటెడ్ బంపర్లు, కొత్త అలాయ్ వీల్స్ రానున్నాయి. ఇంటీరియర్‌లో పెద్ద 10.25-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పానరోమిక్ సన్‌రూఫ్ వంటి మెరుగుదలలు ఉండబోతున్నాయి. ఇంజిన్ విషయానికొస్తే పాత 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్లనే కొనసాగించనున్నారు.
3. టాటా సఫారీ ఈవీ : టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ 7-సీటర్ ఎస్‌యూవీ సఫారీని ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకురానుంది. టాటా act.ev జెన్-2 ఆర్కిటెక్చర్‌పై నిర్మితమవుతున్న ఈ ఈవీ సింగిల్ ఛార్జ్‌పై 500 కిలోమీటర్లకు పైగా డ్రైవింగ్ రేంజ్ ఇచ్చే అవకాశం ఉంది. క్లోజ్డ్ గ్రిల్, ఈవీ స్పెసిఫిక్ అలాయ్ వీల్స్, లెవెల్-2 ADAS, కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో దీపావళి పండుగ సీజన్ నాటికి రూ. 32 లక్షల అంచనా ధరతో ఇది రానుంది.
4. కియా సోరెంట్ : దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా తన తొలి స్ట్రాంగ్ హైబ్రిడ్ 7-సీటర్ ఎస్‌యూవీ సోరెంట్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. టైగర్ నోస్ గ్రిల్, C-షేప్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, 19-ఇంచ్ అలాయ్ వీల్స్‌తో బోల్డ్ లుక్‌లో రానున్న ఈ ఎస్‌యూవీలో 1.6-లీటర్ టర్బో జిడిఐ పెట్రోల్ హైబ్రిడ్, 2.2-లీటర్ సిఆర్‌డిఐ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉండనున్నాయి. దీని అంచనా ధర రూ. 35 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

