Upcoming CNG Cars: పెట్రోల్ బాదుడుకు చెక్.. భారత్‌లోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్న 4 సిఎన్‌జీ కార్లు
4 సిఎన్‌జీ కార్లు

Upcoming CNG Cars: రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ భారం కారు యజమానుల జేబులకు చిల్లులు పొడుస్తోంది. ఈ తలనొప్పికి శాశ్వత పరిష్కారంగా తక్కువ నిర్వహణ ఖర్చు, అత్యధిక మైలేజ్ ఇచ్చే ఇంధన ప్రత్యామ్నాయాల వైపు వాహనదారులు మొగ్గు చూపుతున్నారు. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలు తమ పాపులర్ మోడళ్లలో సీఎన్‌జీ వెర్షన్‌లను మార్కెట్లోకి తెచ్చేందుకు శరవేగంగా అడుగులు వేస్తున్నాయి.
హ్యుందాయ్ బేయాన్ సిఎన్‌జీ
హ్యుందాయ్ కంపెనీ నుంచి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'బేయాన్' కారు ఈ దీపావళి నాటికి భారత వీధుల్లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. నాలుగు మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న కార్ల విభాగంలో హ్యుందాయ్ తెస్తున్న మొదటి సిఎన్‌జీ కారు ఇదే కావడం విశేషం. ఇందులో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు కంపెనీ ఫిట్టెడ్ సిఎన్‌జీ సిస్టమ్‌ను అమర్చనున్నారు. సాధారణంగా డిక్కీలో ఉండే సిఎన్‌జీ ట్యాంక్‌ను కారు అడుగుభాగంలో అమర్చడం ఈ కారు ప్రధాన ప్రత్యేకత. దీనివల్ల ప్రయాణికుల లగేజీ పెట్టుకునే స్థలానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మారుతి సుజుకి విక్టోరిస్ సీఎన్‌జీకి ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.
టాటా కర్వ్ సిఎన్‌జీ
ఇటీవలే కర్వ్ సిరీస్ X మోడల్‌తో సందడి చేసిన టాటా మోటార్స్, త్వరలోనే కర్వ్ సీఎన్‌జీ వెర్షన్‌ను కూడా పరిచయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పెద్ద కార్లలో కూడా సీఎన్‌జీ ఆప్షన్ ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన టాటా, తన పేటెంట్ డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించనుంది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌కు జతగా రెండు చిన్న సీఎన్‌జీ సిలిండర్లను అమర్చడం వల్ల కారు శక్తివంతమైన పనితీరును కనబరుస్తుంది. ఇది 99 బిహెచ్‌పి పవర్, 170 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందుబాటులోకి రానుంది.
టాటా సియెర్రా సిఎన్‌జీ
ఐకానిక్ మోడల్ అయిన టాటా సియెర్రా కొత్త రూపంలో సీఎన్‌జీ రంగానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇటీవల ఉద్గార పరీక్షల సమయంలో రోడ్లపై ప్రత్యక్షమైన ఈ కారుపై ఆటోమొబైల్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆర్గాస్ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ కారు సీఎన్‌జీ సిస్టమ్‌కు పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉంటుంది. ఐ-సిఎన్‌జీ టెక్నాలజీతో పాటు 1.5 లీటర్ ఇంజన్‌ను ఇందులో అందించే అవకాశముంది. మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇది మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ సీఎన్‌జీ కార్లకు సవాల్ విసిరే అవకాశం ఉంది.
కియా కేరెన్స్ క్లావిస్ సిఎన్‌జీ
దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా సైతం భారత్‌లో ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్‌జీ కార్ల విభాగంలోకి అడుగుపెట్టేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ప్రజాదరణ పొందిన కేరెన్స్ క్లావిస్ మోడల్ సీఎన్‌జీ వెర్షన్‌ను 2026 దీపావళికి ముందే అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే దేశీయ రహదారులపై ఈ కారు టెస్టింగ్ విజయవంతంగా కొనసాగుతోంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రానున్న ఈ ఫ్యామిలీ కారు, పర్సనల్ వాడకందారులతో పాటు ఫ్లీట్ ఆపరేటర్లకు ఎంతో లాభదాయకంగా మారనుంది.

