Budget Bike : స్ప్లెండర్ కంటే చవకైన.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ 5 బైక్‌లు ఇవే
ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ 5 బైక్‌లు ఇవే

Budget Bike : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ అంటే అందరికీ గుర్తొచ్చేది హీరో స్ప్లెండర్. అయితే, ప్రస్తుతం దీని ప్రారంభ ధర రూ.73,764 (ఎక్స్-షోరూమ్) ఉంది. మార్కెట్లో ఇప్పుడు స్ప్లెండర్ కంటే తక్కువ ధరలో ఉంటూనే, మెరుగైన మైలేజ్, ఎక్కువ ఫీచర్లను అందిస్తున్న 100సీసీ బైక్‌లు చాలా అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో మంచి పవర్, మైలేజ్, ఫీచర్లు ఉన్న బైక్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి స్ప్లెండర్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న బెస్ట్ 5 బైక్‌ల వివరాలు తెలుసుకుందాం.
1. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌ను స్ప్లెండర్‌కు చవకైన వెర్షన్‌గా చెప్పవచ్చు. ఇందులో 97.2సీసీ ఇంజన్ ఉంది. ఈ బైక్ సుమారు 7.91 బీహెచ్‌పీ పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది లీటరుకు సుమారు 70 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.58,020 నుండి మొదలవుతుంది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఇందులో i3S (ఐడిల్ స్టాప్-స్టార్ట్) టెక్నాలజీ ఉంది. 165mm గ్రౌండ్ క్లియరెన్స్, సౌకర్యవంతమైన సీటింగ్ దీనిని రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఆప్షన్.
2. టీవీఎస్ స్పోర్ట్
స్ప్లెండర్ రేంజ్‌లోనే కాస్త స్పోర్టీ లుక్ కోరుకునేవారికి టీవీఎస్ స్పోర్ట్ ఒక మంచి ఆప్షన్. దీనిలో 109.7సీసీ ఇంజన్ ఉంటుంది. ఇది 8.18 బీహెచ్‌పీ పవర్, 8.3 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. మైలేజ్ విషయంలో ఇది కూడా సుమారు లీటరుకు 70 కి.మీ వరకు ఇస్తుంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.58,200 (ఎక్స్-షోరూమ్). యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ఎస్‌బిటి బ్రేకింగ్ సిస్టమ్, డిజిటల్-అనలాగ్ క్లస్టర్ వంటి అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
3. హోండా షైన్ 100
హోండా షైన్ 100 ప్రత్యేకంగా స్ప్లెండర్‌కు పోటీ ఇచ్చేందుకు మార్కెట్లోకి వచ్చింది. ఇందులో 98.98సీసీ ఇంజన్ ఉంది, దీని పవర్ అవుట్‌పుట్ 7.38 బీహెచ్‌పీ, 8.05 ఎన్ఎమ్ టార్క్. మైలేజ్ సుమారు లీటరుకు 55–60 కి.మీ వరకు ఉంటుంది. దీని ధర రూ.63,191 (ఎక్స్-షోరూమ్). కాంపీ బ్రేకింగ్ సిస్టమ్, 168mm గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఫీచర్లతో ఇది సిటీ, గ్రామీణ ప్రాంతాలకు అనువుగా ఉంటుంది.
4. బజాజ్ ప్లాటినా 100
అధిక మైలేజ్, కంఫర్ట్ కోసం బజాజ్ ప్లాటినా 100 ప్రసిద్ధి చెందింది. ఇందులో 102సీసీ ఇంజన్ ఉంటుంది. ఇది 7.77 బీహెచ్‌పీ పవర్, 8.3 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ బైక్ లీటరుకు 70 కి.మీ వరకు మైలేజ్ ఇవ్వగలదు. ధర రూ.65,407 (ఎక్స్-షోరూమ్). LED DRL, అల్లాయ్ వీల్స్, 200ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఫీచర్లు ఇందులో లభిస్తాయి. దీనివల్ల లాంగ్ రైడ్‌లకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.
5. టీవీఎస్ రేడియన్
టీవీఎస్ రేడియన్ అనేది ప్రీమియం లుక్, మంచి ఫీచర్లు కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్. దీనిలో 109.7సీసీ ఇంజన్ ఉంది. ఇది 8.08 బీహెచ్‌పీ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మైలేజ్ దాదాపు లీటరుకు 68.6 కి.మీ ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.66,300. రివర్స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, యూఎస్‌బీ ఛార్జర్, సైడ్-స్టాండ్, లో బ్యాటరీ ఇండికేటర్ వంటి ఫీచర్లతో రేడియన్ స్ప్లెండర్‌కు గట్టి పోటీ ఇస్తుంది.
