Best Bikes : భారతీయ రోడ్లపై బైక్ నడపడం అంటే అది కేవలం ప్రయాణం మాత్రమే కాదు, అదొక స్టైల్ స్టేట్‌మెంట్. ముఖ్యంగా యువతలో పవర్‌ఫుల్ ఇంజిన్, అదిరిపోయే లుక్స్ ఉన్న బైక్‌లకు క్రేజ్ ఎప్పుడూ ఎక్కువే. ప్రస్తుతం మార్కెట్లో రూ.2 లక్షల లోపు బడ్జెట్‌లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చే బైక్‌లు చాలానే ఉన్నాయి. మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే రేంజ్ చూపించే బైక్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ 5 టాప్ బైక్‌లపై ఓ లుక్కేయండి.

1. హీరో ఎక్స్‌పల్స్ 210

మీకు రోడ్ల కంటే కొండలు, గుట్టలు, కఠినమైన దారుల్లో ప్రయాణించడం ఇష్టమైతే, ఈ బైక్ మీకు బెస్ట్ ఛాయిస్. ఇందులో 210cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంది, ఇది 24.6 bhp పవర్‌ను ఇస్తుంది. ఆఫ్-రోడింగ్ కోసం 21-అంగుళాల ఫ్రంట్ వీల్, సర్దుబాటు చేసుకోగలిగే సస్పెన్షన్ ఉన్నాయి. దీని బ్లూటూత్ కనెక్టివిటీ, మూడు ఏబీఎస్ మోడ్లు రైడింగ్‌ను సురక్షితం చేస్తాయి. దీని ప్రారంభ ధర సుమారు రూ.1.64 లక్షలు.

2. హీరో ఎక్స్‌ట్రీమ్ 250R

స్ట్రీట్ ఫైటర్ లుక్‌తో కిర్రాక్‌గా కనిపించే ఈ బైక్ కుర్రాళ్లకు బాగా నచ్చుతుంది. 249cc ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ 29.5 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే స్పీడ్ విషయంలో దీనికి ఎదురులేదు. ఇందులో 43mm యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్స్ ఉండటం వల్ల డ్రైవింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎల్‌ఈడీ లైటింగ్, ఎల్‌సీడీ డిస్‌ప్లే వంటి మోడ్రన్ ఫీచర్లు దీని సొంతం. దీని ధర రూ.1.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

3. టీవీఎస్ అపాచీ RTR 200 4V

తక్కువ ధరలో స్పోర్ట్స్ బైక్ అనుభూతి కావాలనుకునే వారికి అపాచీ ఎప్పుడూ తోపే. ఇందులో 197.75cc ఆయిల్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఈ బైక్‌లో మూడు రైడింగ్ మోడ్లు (అర్బన్, రెయిన్, స్పోర్ట్) ఉండటం విశేషం. స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీ వల్ల గేర్లు మార్చడం చాలా సులభం. దీని ధర రూ.1.37 లక్షల నుండే మొదలవుతుంది, కాబట్టి ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ.

4. యమహా MT-15 V2

యమహా బైక్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీని డిజైన్ చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. 155cc ఇంజిన్ అయినప్పటికీ, ఇది ఇచ్చే పర్ఫార్మెన్స్ 200cc బైక్‌లకు పోటీనిస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యమహా నమ్మకం, అదిరిపోయే మైలేజ్ దీని ప్లస్ పాయింట్స్. దీని ధర సుమారు రూ.1.59 లక్షలు.

5. టీవీఎస్ రోనిన్

మీకు క్లాసిక్, మోడ్రన్ లుక్స్ కలిసిన నియో-రెట్రో స్టైల్ ఇష్టమైతే రోనిన్ సరైనది. ఇది 225.9cc ఇంజిన్‌తో వస్తుంది. సిటీ రైడింగ్‌కు ఇది చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. దీని అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్, డిజిటల్ మీటర్, స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్లు దీనిని ప్రీమియం బైక్‌గా మార్చాయి. దీని ధర రూ.1.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఐదు బైక్‌లలో ఏదో ఒకటి ఎంచుకుంటే మీరు రోడ్డుపై కింగ్ లా కనిపించడం ఖాయం.

PolitEnt Media

PolitEnt Media

Next Story