Fuel Saving Tips : ప్రస్తుతం రోజురోజుకూ మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల సామాన్య వాహనదారుల బడ్జెట్ పూర్తిగా తలకిందులవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కారు మంచి మైలేజ్ ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరి అత్యంత ముఖ్యమైన అవసరంగా మారింది. చాలా మంది తమ కారు పాతదైపోవడం వల్లే మైలేజ్ రావడం లేదని భావిస్తుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. చాలా సందర్భాలలో డ్రైవింగ్ చేసేటప్పుడు మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, నిర్లక్ష్యమే కారు ఎక్కువ ఇంధనాన్ని తాగేలా చేస్తాయి. మీ కారు కూడా అవసరానికి మించి ఇంధనాన్ని లాగేస్తోంటే కంగారు పడాల్సిన పని లేదు. మన అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా కారు మైలేజీని అద్భుతంగా పెంచుకోవచ్చు. మీ జేబుకు చిల్లు పెట్టే ఆ 5 తప్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.

1. టైర్లలో గాలి తక్కువగా ఉంచడం బిగ్ మిస్టేక్

కారు మైలేజీని నిర్ణయించడంలో టైర్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. చాలా మంది టైర్లలో గాలి తగ్గినా పట్టించుకోకుండా అలాగే తిప్పుతుంటారు. టైర్లలో ప్రెజర్ తక్కువగా ఉన్నప్పుడు రోడ్డుపై కారుపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కారును ముందుకు లాగడానికి ఇంజిన్ చాలా ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ఇంజిన్ ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ పెట్రోల్ ఖర్చవుతుంది. అందుకే వారానికి కనీసం ఒక్కసారైనా టైర్ ప్రెజర్ చెక్ చేయించుకోవాలి. కంపెనీ సూచించిన సరైన స్థాయిలో గాలిని మెయింటెన్ చేయడం వల్ల మైలేజ్ పెరగడమే కాకుండా టైర్ల లైఫ్ కూడా పెరుగుతుంది.

2. సకాలంలో సర్వీసింగ్ చేయించకపోవడం

కారు కొత్తదైనా, పాతదైనా దానికి టైమ్ టు టైమ్ సర్వీసింగ్ చేయడం చాలా అవసరం. కారులో ఇంజిన్ ఆయిల్‌ను సకాలంలో మార్చకపోయినా లేదా ఎయిర్ ఫిల్టర్ పూర్తిగా దుమ్ముతో నిండిపోయినా ఇంజిన్ పనితీరు మందగిస్తుంది. ఎయిర్ ఫిల్టర్ మురికిగా మారడం వల్ల ఇంజిన్‌కు తగినంత గాలి అందదు. ఆ సమయంలో ఇంజిన్ ఎక్కువ ఇంధనాన్ని మండించడం ప్రారంభిస్తుంది. అందుకే నిర్ణీత కిలోమీటర్లు దాటగానే ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్‌లను క్రమం తప్పకుండా మారుస్తూ ఉండాలి.

3. క్లచ్, గేర్లను తప్పుగా ఉపయోగించడం

చాలా మందికి డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ క్లచ్‌పై కాలు పెట్టి ఉంచే అలవాటు ఉంటుంది. దీనిని హాఫ్ క్లచ్ డ్రైవింగ్ అంటారు. ఈ చెడు అలవాటు వల్ల కారు విడిభాగాలు పాడైపోవడమే కాకుండా మైలేజ్ దారుణంగా పడిపోతుంది. అలాగే కారు స్పీడ్‌కు తగ్గట్టుగా సరైన గేర్లు మార్చడం కూడా ముఖ్యం. తక్కువ స్పీడ్‌లో ఉన్నప్పుడు టాప్ గేర్ వేయడం, ఎక్కువ స్పీడ్‌లో ఉన్నప్పుడు చిన్న గేరుపైనే కారును లాగడం వల్ల ఇంజిన్‌పై విపరీతమైన భారం పడుతుంది. ఇంజిన్‌ను ఎంత ఫ్రీగా ఉంచితే మైలేజ్ అంత బాగా వస్తుంది.

4. డిక్కీని స్టోర్ రూమ్‌లా మార్చేయడం

కొందరి కార్ల డిక్కీలు చూస్తే ఇళ్లల్లో ఉండే స్టోర్ రూమ్‌లను తలపిస్తాయి. అవసరం లేని భారీ వస్తువులు, పాత టూల్స్, ఇతర సామాన్లను కారులోనే వేసుకుని తిరుగుతుంటారు. కారులో బరువు పెరిగే కొద్దీ దానిని ముందుకు నెట్టడానికి ఇంజిన్‌కు అదనపు శక్తి అవసరమవుతుంది. దీనివల్ల ఇంధన వినియోగం ఒక్కసారిగా పెరిగిపోతుంది. కాబట్టి కారులో ఎప్పుడూ అనవసరమైన బరువులు ఉంచకండి, కేవలం అత్యవసరమైన సామాగ్రిని మాత్రమే క్యారీ చేయండి.

5. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇంజిన్ ఆన్ చేసి ఉంచడం

ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద లేదా భారీ జామ్‌లలో చిక్కుకున్నప్పుడు 30 సెకన్ల కంటే ఎక్కువ సమయం ఆగాల్సి వస్తే కారు ఇంజిన్‌ను వెంటనే ఆఫ్ చేయడం ఉత్తమమైన మార్గం. కారు కదలకుండా ఒకే చోట ఆగి ఉన్నప్పటికీ ఇంజిన్ ఆన్‌లో ఉంటే పెట్రోల్ నిరంతరాయంగా వృథా అవుతూనే ఉంటుంది. అందువల్ల ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సి వస్తే ఇంజిన్ ఆఫ్ చేసేయండి. ఈ చిన్న చిట్కాను పాటిస్తే మీ పెట్రోల్ డబ్బులు భారీగా ఆదా అవుతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story